రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస నేతలు-రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను అపహరించుకుపోయిన మావోయిష్టులు వారికి ఎటువంటి హానీ చేయకుండా ఈరోజు తెల్లవారు జామున జిల్లాలోని చర్ల అటవీ ప్రాంతంలో తీసుకువచ్చి వదిలేశారు. మావోయిష్టులు అజెండా అమలు చేస్తామని చెప్పిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత మావోయిష్టులను భూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తూ బంగారి తెలంగాణాకు బదులు మావోల రక్తంతో నెత్తుటి తెలంగాణాని ఏర్పాటుచేసారని, ఆయన ప్రభుత్వానికి హెచ్చరించడానికే తాము తెరాస నేతలను బందీలుగా పట్టుకొన్నామని మావోయిష్టుల నేత జగన్ బందీలుగా చిక్కినవారికి చెప్పారు. కనుక ఇకనయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తమను పట్టుకొనేందుకు అడవులలో కొనసాగుతున్న పోలీస్ కూంబింగ్ తక్షణమే నిలిపి వేయాలని, అలాగే మావోలను భూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెరాస నేతల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వర్తమానం పంపించారు. లేకుంటే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెరాస నేతలపై దాడులు చేసి హతమారుస్తామని జగన్ తమను హెచ్చరించినట్లు విడుదలయిన తెరాస నేతలు చెప్పారు.