ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో నిరుపేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా సుమారు 2.23లక్షల ఇళ్ళు కేటాయించింది. వాటిలో సుమారు 1.93లక్షల ఇళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 10, 000 ఇళ్ళను తెలంగాణా రాష్ట్రానికి మిగిలిన ఇళ్ళను గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలకు కేటాయించింది. ఆంధ్రాకు సుమారు 85 శాతం ఇళ్ళు కేటాయించబడితే, తెలంగాణాకు కేవలం 10 శాతం ఇళ్ళు మాత్రమే మంజూరు అవడంతో తెరాస నేతలు కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల ముందు, కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికలలో బీజేపీని దెబ్బ తీసేందుకు తెరాసకు అదొక మంచి ఆయుధంగా లభించింది.
తెలంగాణా రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మొదటి నుండి ఆరోపిస్తున్న తెరాస నేతలకు సరిగ్గా ఉప ఎన్నికల ముందు అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీపై, కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. తెలంగాణాకు కేంద్రప్రభుత్వం ఎప్పుడూ మొండి చెయ్యి చూపిస్తూనే ఉందని మళ్ళీ ఈ ఇళ్ళ కేటాయింపులో కూడా అలాగే చేసిందని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రాకు చెందినవారయినప్పటికీ తెలంగాణా పట్ల మరీ ఇంత వివక్ష చూపడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. తన నిజామాబాద్ నియోజక వర్గం ఒక్కదానికే సుమారు 75,000 ఇళ్ళు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10,000 రాష్ట్రం మొత్తానికి ఏవిధంగా సరిపోతాయని ఆమె ప్రశ్నించారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తోందని, తాము పంపిన ప్రతిపాదనలను వేటినీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి తాము పంపిన ప్రతిపాదనలపై కేంద్రప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని ఆమె ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలలో ఈ అంశంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలకు పోలింగ్ ఈరోజు జరుగుతున్నందున, ఓటర్లపై తెరాస నేతలు చేస్తున్న ఈ విమర్శల ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్య నష్టపోవచ్చును.