రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన పరిస్ధితి లేకుండా జి ఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) విషయంలో రాజ్యాంగ సవరణ చేయవలసిందేనని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. బందరు పోర్టుకి బలవంతపు భూసేకరణ ఆపకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించక తప్పదని బిజెపి స్ధానిక నాయకులు శనివారం హెచ్చరించారు.
ఈ రెండు సంఘటనలకూ సంబంధం లేదు. అయితే ఇందులో రాజ్యాంగ సవరణ కష్ట సాధ్యమైన కేంద్ర ప్రభుత్వ నిస్సహాయత వుంది. పోర్టుకి 30 వేల ఎకరాల భూ సేకరణ నుంచి వెనక్కి వెళ్ళలేని రాష్ట్రప్రభుత్వ దృఢ నిర్ణయం వుంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల వైరుధ్యాలు ఈ సంఘటనల ద్వారా రోడ్డున పడ్డాయి. ఇంత మాత్రానికే రెండు పార్టీలూ పోట్లాడుకుంటాయని కాదు. ఏడాదిన్నర రాజకీయ హానీమూన్ ముగిసింది కాబట్టి పోట్లాటలు మొదలయ్యే వాతావరణమైతే ఏర్పడింది. వచ్చే మూడున్నర ఏళ్ళ బంధం ఎలాగుంటుందన్న ఆసక్తి, కుతూహలాలను ఈ సంఘటనలు మొదటి సారి రేకెత్తిస్తున్నాయి. వివరాలు ఇలా వున్నాయి.
జి ఎస్ టి అమలుతో రాష్ట్రాలకు వివిధ రూపాల్లో ఎదురయ్యే నష్టాల భర్తీకి నష్టపరిహారాల చెల్లింపు నిధి ఏర్పాటు చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ కరాఖంఢిగా చెప్పింది. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి బిల్లులో పొందుపర్చి తీరాలన్న తమ షరతును ఆమోదించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. జి ఎస్ టి అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. సమావేశంలో యనమల మాట్లాడుతూ నష్టపరిహార నిధి లేకుంటే, రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ చేస్తోందన్నారు. జి ఎస్ టి పరిధి నుంచి ధాన్యంసహా మరికొన్ని ఆహార ధాన్యాలను మినహాయించటం వల్ల ఆంధ్రకు సాలీనా 700 కోట్ల ఆదాయానికి గండి పడుతుందన్నారు. కాగా ఇప్పుడున్న పన్నుశాతం భవిష్యత్లో మారే అవకాశాలు ఉన్నందున, ఈ రూపంలో మరో రెండువేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన అమలుకు ముందు, ఈ ఉత్పత్తులపై పన్నులు విధించుకునే అధికారాలు రాష్ట్రాలకు విడిచిపెట్టాలని సూచించారు. 2011-12కు సంబంధించి జిఎస్టీ కింద ఆంధ్రకు 1873 కోట్లు బకాయి లభించాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని ఇచ్చిన హామీమేరకు ఇంతవరకూ 672 కోట్లు మాత్రమే అందాయన్నారు. స్థానిక సంస్థలకు ప్రకటనల రూపంలో వస్తున్న ఆదాయాన్ని కత్తిరించొద్దని కోరారు. జి ఎస్ టి అమలులో తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తూ తమ కమిటీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపిన నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియచేయాలని యనమల డిమాండ్ చేశారు.
ఇలా వుండగా బందర్ పోర్టు కి భారీ భూసేకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలో బీజేపీ పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు పలు విమర్శలు గుప్పించారు. పోర్టు పేరు చెప్పి రైతుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈసందర్భంగా ఆ పార్టీ జిల్లా నేతలు టివి చానెళ్ళలో మాట్లాడారు. పోర్టుకి నాలుగు వేల ఎకరాలు రాజశేఖరరెడ్డి హాయాంలో, 5200 ఎకరాలు కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో సేకరించాలని నిర్ణయించగా చంద్రబాబు ఈ విస్తీర్ణాన్ని 30 వేల ఎకరాలకు పెంచడం దారుణమని విమర్శించారు.పోర్టు కట్టకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు అని నాటకాలాడుతూ 22 గ్రామాలకు భూములు లేకుండా చేస్తారా అని విమర్శించారు.