ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి హరిరామ వెంకట జోగయ్య మళ్ళీ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన పార్టీ నేతలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేవలం రెండు జిల్లాలనే అభివృద్ధి చేసుకుపోతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. “హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటునే చంద్రబాబు నాయుడు మళ్ళీ చేస్తున్నట్లున్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే మళ్ళీ అతువంటి సమస్యలే పునరావృతం అవడమే కాకుండా వచ్చే ఎన్నికలలో మిగిలిన జిల్లాల ప్రజలు తెదేపాకు గుణపాఠం చెప్పడం ఖాయం. కనుక ఇప్పటికయినా చంద్రబాబు నాయుడు మిగిలిన అన్ని జిల్లాలపై దృష్టిపెట్టి వాటిని కూడా సమానంగా అభివృద్ధి చేయాలి. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఉంచి, అక్కడ చేయదలచుకొన్న అభివృద్ధిని మిగిలిన అన్ని జిల్లాలకు వికేంద్రీకరణ చేయాలి. రాజమండ్రిలో ఎయిమ్స్ ఆసుపత్రి, ఏలూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలి,” అని హెచ్చరించారు.
హరిరామ జోగయ్య మాటలు కొంచెం కటువుగా వినిపిస్తున్నపటికీ, అవి రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతున్నాయి. ఉత్తరాంధ్రా ప్రజలు జరుగుతున్న పరిణామలన్నిటినీ ఇప్పటి వరకు మౌనంగా చూస్తున్నప్పటికీ, రాయలసీమవాసులు తమ నిరసనలను బహిరంగంగానే తెలియజేస్తున్నారు. వారి అసమ్మతిని ప్రభుత్వ వ్యతిరేకతగా భావించకుండా ప్రజాభిప్రాయంగా స్వీకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడం మంచిది. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెదేపా ప్రభుత్వం ఎల్లపుడూ గుర్తుంచుకొని మెలగాలి. ప్రజాభిప్రాయాన్ని ఒక రాజకీయ సమస్యగా భావించి పట్టించుకోకుండా ముందుకు వెళితే ఇప్పుడు తెదేపాకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. కానీ హరిరామ జోగయ్య చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశం ఉంటుంది.