హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన ఇంకా అందరూ మరిచిపోకముందే, మళ్ళీ అదే యూనివర్సిటీలో, అదే బీఆర్క్ కళాశాలలో మరొక ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. సీనియర్లు కొందరు తమను వేధిస్తున్నారని ఇద్దరు జూనియర్ విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయటంతో ఐదుగురు సీనియర్ విద్యార్థులపై వేటు వేశారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. ఇద్దరు విద్యార్థులను రెండు నెలలపాటు సస్పెన్షన్ చేశారు. ఈ ఐదుగురినీ శాశ్వతంగా హాస్టల్నుంచి తొలగించారు. మరోవైపు ర్యాగింగ్ సమాచారం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు మంత్రి నాగార్జున యూనివర్సిటీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిసింది.
ప్రస్తుతం ర్యాగింగ్‌కు పాల్పడినవారుకూడా రిషితేశ్వరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాచ్వారే కావటం విశేషం. వాస్తవానికి రిషితేశ్వరి ఘటన రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించటంతో నాగార్జున యూనివర్సిటీ ర్యాంగింగ్ నిరోధంకోసం అనేక చర్యలు చేపట్టింది. ఆవరణలో పలుచోట్ల సీసీ కెమేరాలు పెట్టటం, అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ విధానాన్ని పెట్టటం, హాస్టల్స్‌లో రెసిడెన్షియల్ వార్డెన్లను నియమించటం వంటి చర్యలు తీసుకున్నారు. అయినాగానీ ర్యాగింగ్ జరగటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేసి అధికారులు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించారు.