హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యెన్నం, బీజేపీ సీనియర్నేత నాగం జనార్దనరెడ్డి వెంట ఉంటూ, ఆయన స్థాపించిన బచావో తెలంగాణ సంస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇవాళ యెన్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ 18 నెలల్లో తెలంగాణలో ఏ మార్పూ జరగలేదని చెప్పారు. ఏ పార్టీకూడా ప్రత్యామ్నాయం కాలేకపోవతున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయం కాలేవని చెప్పారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదికకోసం ఈ అడుగు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా మారతామని చెప్పారు. రాజకీయశక్తులన్నింటికీ బడుగు, బలహీనవర్గాలకు అధికారం కల్పించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బడుగుల తెలంగాణకోసం కృషిచేస్తామని చెప్పారు. నాగం జనార్దనరెడ్డి తమతోనే ఉన్నారని చెప్పారు. అందరూ కలిసి వస్తారని అన్నారు. పలువురు వందలమంది నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తమతో చేరతారని చెప్పారు. పదిజిల్లాలలో బడుగు, బలహీనవర్గాలను కలుపుకుపోతామని అన్నారు. అత్యధికశాతం పదవులు బడుగులకే ఉంటాయని చెప్పారు.
తెలంగాణ లక్ష్యాలు, గమ్యాలు దూరమవుతున్నాయని అన్నారు. ఉద్యమకారులను ఇప్పటివరకు సత్కరించుకోలేకపోయామని చెప్పారు. వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
మరో రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వోద్యోగం మానేసి ఉద్యమంలో చేరానని, ఇప్పుడు మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తున్నానని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ఇంకా బచావో తెలంగాణలోనే ఉన్నానని తెలిపారు. యెన్నం శ్రీనివాసరెడ్డి మొదట టీఆర్ఎస్లో ఉన్నారు. తర్వాత పార్టీ నాయకత్వంపై అసమ్మతితో బీజేపీలో చేరారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. మొత్తానికి ఇప్పుడు కొత్తపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నాగంకూడా త్వరలో తమతో చేరబోతున్నట్లు యెన్నం చెబుతున్నారు.