సల్మాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ సినిమాలో కధ సుఖాంతం అయింది అలాగే వినూత్నమయిన కధతో తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కానీ ఆ సినిమా కారణంగా వెలుగులోకి వచ్చిన గీత కధ మాత్రం ఇంకా తెలుగు టీవీ సీరియల్ లాగే అంతులేకుండా సాగిపోతోంది. పాకిస్తాన్ నుండి భారత్ తిరిగి తీసుకువచ్చిన తరువాత ఆమె తన తల్లితండ్రులను గుర్తించలేకపోవడంతో, భారత ప్రభుత్వం ఆమెను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో గల మూగ చెవుడు బాలబాలికలు ఉండే హాస్టల్లో ఆమెను ఉంచి, అప్పటి నుండి ఆమె అసలయిన తల్లి తండ్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఆమె తల్లితండ్రులమని చెపుతూ వచ్చిన చాలా మందికి డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరివి గీత డి.ఎన్.ఏ. సరిపోలక పోవడంతో ఆమె నేటికీ ఇండోర్ హాస్టల్లోనే భారంగా రోజులు గడుపుతోంది.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇండోర్ వెళ్లి ఆమెను కలిసి దైర్యం చెప్పబోతున్నారు. ఆమెను తిరిగి ఆమె అసలయిన తల్లి తండ్రుల వద్దకు చేర్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుందని అంతవరకు ఆమెకు ఎటువంటి కష్టం, లోపం కలగకుండా జాగ్రత్తగా చూసుకొంతమని ఆమె అన్నారు. తమ ప్రభుత్వం ఆమెను ఆమె తల్లి తండ్రుల చెంతకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని, త్వరలోనే ఏదో ఒకరోజు ఆమె అసలయిన తల్లి తండ్రులను గుర్తించి ఆమెను వారికి అప్పగిస్తామని సుష్మా స్వరాజ్ అన్నారు. మానవీయ కోణంలో చూడవలసిన సున్నితమయిన ఈ సమస్యను కొన్ని రాజకీయపార్టీలు రాజకీయం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.
పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న గీత సుమారు 15 ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ లోకి ప్రవేశించినపుడు ఆమెను స్థానిక ఈద్ ఫౌండేషన్ సంస్థ వారు చేరదీసి ఇన్నాళ్ళు సంరక్షించారు. సరిగ్గా ఆమె జీవిత కధను ప్రతిబింబించే బజరంగీ భాయ్ జాన్ సినిమా విడుదలయిన తరువాత, ఆమె ఉనికి ప్రపంచానికి తెలిసింది. అప్పుడు బిహార్ లో ఒక కుటుంబం ఆమెను ఏనాడో తప్పిపోయిన తమ కుమార్తెగా గుర్తించారు. అలాగే మరి కొంత మంది దంపతులు కూడా ఆమె తమ కుమార్తెనని భావిస్తూ తమ ఫోటోలను, వివరాలను భారత విదేశాంగ శాఖకు అందజేశారు. అధికారులు వారందరి ఫోటోలను ఇస్లామాబాద్ పంపినపుడు, వారిలో బిహార్ కు చెందిన జనార్ధన్ అనే వ్యక్తిని తన తండ్రిగా గీత గుర్తించడంతో ఆమెను ఈద్ ఫౌండేషన్ ప్రతినిధులు భారత్ కి తోడ్కొని వచ్చేరు. భారత్ విదేశాంగ శాఖ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశపరిచారు. కృతజ్ఞతా పూర్వకంగా వారికి మోడీ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా దానిని వారు సున్నితంగా తిరస్కరించారు. మోడీ కూడా ఆమెను పూర్తి భరోసా కల్పించారు. అందుకు గీత చాలా సంతోష పడింది. కానీ ఇంతవరకు ఆమె అసలయిన తల్లితండ్రులెవరో గుర్తించలేకపోవడంతో ఆమె నేటికీ ఇండోర్ హాస్టల్లోనే భారంగా రోజులు గడుపుతోంది. ఆమె కధ ఇంకా ఎప్పుడు సుఖాంతం అవుతుందో ఏమో?