హైదరాబాద్: ఒక రాజకీయ పావులాగా మారిపోయానని, కక్ష సాధింపులకు గురవుతున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి అల్లుడు రాబర్ట్ వాద్రా వాపోతున్నారు. తాను వ్యాపారాన్ని పారదర్శకంగానే, చట్టాలకు, నిబంధనలకు లోబడి చేస్తూవస్తున్నానని అయినాకూడా తనను భూతద్దంలో చూస్తూ తనపై పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్‌లలో తన వ్యాపార ఒప్పందాలపై జరుగుతున్న విచారణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు నోటీస్ పంపటం స్పష్టమైన కక్ష సాధింపేనని అన్నారు. ప్రజల దృష్టిని మళ్ళించాలనుకున్న ప్రతిసారీ తనపై ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
హర్యానాలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గురగావ్లోని నాలుగు గ్రామాలలో భూముల లైసెన్స్‌లను వాద్రా కంపెనీసహా కొన్ని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు మంజూరు చేయటంపై దర్యాప్తుకోసం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గత మే నెలలోజస్టిస్ ధింగ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రాబర్ట్ వాద్రా ఈ దర్యాప్తుపై మాట్లాడుతూ, తనకు దీనిపై ఎటువంటి నోటీసులూ రాలేదని, దీనిగురించి మీడియాలో వార్తలద్వారానే తెలిసిందని వాద్రా చెప్పారు. చట్టంపట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఎప్పటికైనా నిజం నిలకడగా తేలుతుందని తాను విశ్వసిస్తానని వ్యాఖ్యానించారు. తాను చేసిందేమిటో, చేయనిదేమిటో అంతా ప్రజలకు తెలుసని చెప్పారు. విమానాశ్రయాలలో భద్రతా తనిఖీలనుంచి మినహాయింపు పొందే వీవీఐపీల జాబితానుంచి తన పేరును తొలగించటంపై స్పందిస్తూ, వీఐపీ, స్పెషల్ ట్రీట్మెంట్ను తానెప్పుడూ ఎంజాయ్ చేయలేదని, ఉపయోగించుకోలేదని తెలిపారు. తాను వీఐపీని కానని, అలా పరిగణించబడాలనికూడా అనుకోవటంలేదని అన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై స్పందిస్తూ, సాధారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక అల్లకల్లోలం దురదృష్టకరమని చెప్పారు. స్వేచ్ఛను, భావవ్యక్తీకరణను, వివిధ మతస్థులు తమ మతాన్ని అనుసరించటాన్ని, తమ మనసుకు నచ్చిన ఆహారాన్ని తినటాన్ని కట్టడి చేయాలనుకోవటం పురాతన భావజాలమని, ఇది పురోగతిని, అభివృద్ధిని అడ్డుకుంటుందని వాద్రా అన్నారు.