అస్సాం గవర్నర్ పి.బి.ఆచార్య ఒక పుస్తకావిష్కరణ సభలో చేసిన వ్యాఖ్యలు, దానిపై చెలరేగిన విమర్శలకు సర్దిచెప్పుకొనే ప్రయత్నంలో మళ్ళీ ఆయన చెప్పిన మాటలు ఆయన పదవికి ఎసరు తెచ్చేలాగ ఉన్నాయి. “హిందూ దేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి…ముస్లింలు అందరూ పాకిస్తాన్ వెళ్లి పోవచ్చు”ననే అర్ధం వచ్చే విధంగా మాట్లాడారు. ఆయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవడంతో, తన తన మాటలను మీడియా వక్రీకరించిందని చెపుతూ, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేరు. కానీ అది ఆయన ముందు చెప్పిన మాటలనే మరింత గట్టిగా నొక్కి చెప్పినట్లయింది తప్ప తన తప్పును సరిద్దుకొనే ప్రయత్నం చేసినట్లు లేదు.
“ఒక దేశంలో నివసిస్తున్న వేరే దేశస్తులు తాము వివక్ష ఎదుర్కొంటున్నట్లు భావిస్తే అప్పుడు వారు తమ స్వదేశానికి వెళ్లిపోతుంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో స్థిరపడిన అనేక మంది హిందువులు తమకు ఆ దేశాలలో అన్యాయం జరిగిందని భావించి భారత్ కి తిరిగి వస్,తే వారిని మన దేశం అక్కున చేర్చుకొని ఆదరిస్తోంది. ఆవిధంగా వచ్చినవారే పార్సీలు. వారిలో టాటా, గోద్రెజ్, వాడియా వంటివారు భారతదేశంలో ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలుసు. భారత్ లో మత అసహనం అనేదేలేదు. అందరినీ సమానంగా హక్కులు కలిగి ఉంటారు. అందరూ స్వేచ్చగా జీవించవచ్చును.నేను అదే ఉద్దేశ్యంతో ముస్లింల గురించి అన్నాను తప్ప వారిని నేను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని అనలేదు. ఒకవేళ వారికి భారత్ లో అన్యాయం జరుగుతోందని భావిస్తుంటే వారు కూడా ఏ దేశానికయినా వెళ్లిపోవచ్చునని మాత్రమే అన్నాను. అలాగే భారత్ కేవలం హిందువులదేనని కూడా అనలేదు,” అని వివరణ ఇచ్చేరు.
ఆయన మాటలు విన్నట్లయితే ఆయన మనసులో ఏముందో స్పష్టం అవుతోంది. వివక్షకు గురవుతున్నామని భావించే ముస్లింలందరూ పాకిస్తాన్ వెళ్లిపోవచ్చుననే ఆయన చెపుతున్నారు తప్ప గవర్నర్ వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఆవిధంగా మాట్లాడటం తప్పు, పొరపాటు జరిగింది అని ఆయన ఒప్పుకొన్నట్లుగా లేదు. అందుకే ఆయన గవర్నర్ పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హుడు కాడని, ఆయనను వెంటనే ఆ పదవిలో నుండి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని గవర్నర్ గా నియమించాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసారు.
ఆయన మాట్లాడిన మాటలకు బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదని అర్ధమవుతూనే ఉంది. కానీ ఆయన ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలాగ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఆరోపించారు. దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని అడ్డుకోలేక మోడీ ప్రభుత్వం, బీజేపీ నానా అవస్థలు పడుతుంటే, గవర్నర్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం ఈవిధంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో బీజేపీకి, మోడీ ప్రభుత్వానికే ఆ చెడ్డపేరు ఆపాదించబడుతోంది. ఇకనయినా మోడీ ప్రభుత్వం మేల్కొని ఈ విధంగా మాట్లాడేవారిపై కటినమయిన చర్యలు తీసుకోనట్లయితే, ప్రభుత్వానికి చెడ్డపేరు ఎలాగు వస్తుంది. అంతే కాక దేశంలో మతసామరస్యం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.