భారతీయ క్రికెట్ లో విపరీత ధోరణులను అరికట్టడానికి బి సి సి ఐ కి సమయం లేదు. కానీ, మనమీద కత్తిగట్టిన పాకిస్తాన్ తో ఓ సిరీస్ ను ఓకే చేయడానికి దుబాయి దాకా వెళ్లి చర్చలు జరపడానికి బోర్డు అధ్యక్షుడికి సమయం ఉంది. ఓ వైపు కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. సరిహద్దుల్లో టెర్రరిస్టులు పొంచి ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేదాకా చర్చల ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో అసాధ్యమని తెగేసి చెప్పింది.
అలాంటప్పుడు ఉగ్రవాదం, క్రికెట్ ఏకకాలంలో ఎలా సాధ్యం? మన జవాన్లను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపుతూ ఉంటే మనం మాత్ర అదేమీ పట్టనట్టు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ను ఎంజాయ్ చెయ్యాలా? బోర్డుకు డబ్బు యావ తప్ప దేశం పట్ల ఆలోచనే లేదు. పాకిస్తాన్ లో క్రికెట్ దివాళా తీసింది. అది మళ్లీ బతికి బట్టకట్టాలంటే భారత్ తో సిరీస్ ఆడాలని అక్కడి బోర్డు తహతహలాడుతోంది. దానికి మన బోర్డు వంత పాడుతోంది. చివరకు, మన దరిదాపులకు కూడా రానివ్వకూడని పాక్ బోర్డుచేత ఛీ కొట్టించుకుంది మన క్రికెట్ బోర్డు.
భారత్ లో సిరీస్ రావాలని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పంపిన ఆహ్వానాన్ని పాక్ బోర్డు తిరస్కరించింది. వేరే దేశంలో అయితే ఆడతామని చెప్పింది. దీని గురించి చర్చించడానికి శశాంక్ మనోహర్ దుబాయి వెళ్లారు. పాక్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ తో చర్చించారు. సిరీస్ ఎక్కడ, ఎప్పుడు జరపాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. జాతి ప్రయోజనాల కంటే, ఈ సిరీస్ ద్వారా వచ్చే డబ్బే బోర్డుకు ముఖ్యమైనట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వ జోక్యం లేకుండా బోర్డుకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసివస్తోంది. అసలు భారతీయ క్రికెట్ కు ఈ బోర్డు వ్యవస్థే పెద్ద శత్రువని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు కక్కుర్తి బోర్డు చిల్ల చేష్టలు జుగుప్స కలిగిస్తున్నాయి. పాక్ తో సిరీస్ కు ఇంతగా తహతహలాడాల్సిన అవసరం ఏముంది? ఒక వేళ ఏదైనా తటస్ఠ వేదికపై సిరీస్ ఖరారైనా, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనేది ప్రశ్న.