హైదరాబాద్: చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. ఉద్దండ రాయనపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని, రాయపూడిలోని పురాతన కట్టడాలను సభ్యులు పరిశీలించారు. తర్వాత వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధిలో తమకు చైనాయే స్ఫూర్తి అన్నారు. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయని చెప్పారు. చైనా సిల్క్ రోడ్ రూట్‌ను ఏపీలోని విశాఖపట్నం మీదగుండా తీసుకెళ్ళాలని చైనా మంత్రిని కోరినట్లు తెలిపారు. పెట్టుబడులకు షాంఘై తర్వాత అమరావతిని సెకండ్ హోమ్‌గా పరిగణించాలనికూడా అడిగినట్లు అనంతరం మాట్లాడిన చైనా మంత్రి చెంగ్, చంద్రబాబు చైనా పర్యటన అనంతరం చైనాతో ఏపీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మరిన్ని చైనా సంస్థలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి సహకరించటానికి చైనా ప్రభుత్వం హామీ ఇచ్చిందని కిషోర్ బాబు అన్నారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఏపీకి ఉపయోగపడతాయని చెప్పారు.