“చుట్టూ అంత మంది జనం,మీడియా కెమెరాలు ఉన్నాయని కూడా చూడకుండా ఆయనే నా మీదపడి బలవంతంగా కౌగలించుకొంటే నేనేమీ చేయను? అందులో నా తప్పేమీ లేదు. అయినా నలుగురిలో కౌగలించుకొన్నంత మాత్రాన్న ఏదేదో అనేసుకోవడమేనా? అని రుసరుసలాడుతున్నారు. ఇదేదో ఆడామగ సంబంధించిన వ్యవహారం కాదు. మగమగా వ్యవహారం…ఆ..ఆ..మళ్ళీ తప్పుగా అర్ధం చేసుకోవద్దు.
ఇది లాలూ ప్రసాద్ యాదవ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కౌగిలింతల వ్యవహారం. నితీష్ కుమార్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయిన అనేకమందిలో ఆ భాగ్యం కేవలం తనకే దక్కడం చూసి ఓర్వలేని బీజేపీ వాళ్ళే పనిగట్టుకొని దాని గురించి ప్రచారం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతిపరుడని తెలిసినప్పటికీ అయిష్టంగానే తను ఏదో మర్యాద కోసం ఆయనతో చేతులు కలిపితే (షేక్ హ్యాండ్), తనేదో నిజంగానే ఆయనతో చేతులు కలిపేసినట్లు నిర్ధారించేయడం సబబు కాదని అరవింద్ కేజ్రీవాల్ తెగ బాధ పడిపోతున్నారు. పైగా తమ కౌగిలింత ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టేసి దానిపై నెటిజన్లు జోకులు వేసుకొంటూ అందరూ కలిసి తన పరువు బజారుకీడ్చుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ తెగ బాధ పడుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనని కౌగలించుకొన్నంత మాత్రాన్న తన శీలం (నీతి,నిజాయితీ) కోల్పోలేదని పదేపదే అందరికీ చెప్పుకోవలసి రావడంతో “అత్త కొట్టినందుకు కాదు…అత్త కొడుతున్నప్పుడు తోడి కోడలు నవ్వినందుకే బాధ పడుతున్నాను” అన్నట్ తయారయింది అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. అయినా ఈ లాలూ-అరవింద్ క్రేజీ హగ్ గురించి ఈ జనాలు ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తారో ఏమిటో?