హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడి తనకు మంత్రిపదవి ఇస్తానని అధికారికంగా ప్రకటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతాపార్టీ-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి దేవయ్య చెప్పారు. ఫలితంపై వ్యాఖ్యానిస్తూ, వరంగల్ నియోజకవర్గంలో గెలిపిస్తే దేవయ్యకు మంత్రిపదవి ఇస్తామని ప్రధానమంత్రి ప్రకటించకపోవటంవల్లే ఈ ఓటమి సంభవించిందని అన్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తనకు సహకరించలేదని ఆరోపించారు. ఓడిపోయినా ప్రజలతోనే ఉంటానని చెప్పారు. తనకేమీ నిరుత్సాహం కలగలేదని, ప్రజల్లో గుర్తింపు వచ్చిందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కరే ఏడో తరగతి ఫెయిలయిన అభ్యర్థి చేతిలో ఓడిపోయాడని, తానెంత అని వ్యాఖ్యానించారు. అధికారపార్టీ తీవ్రంగా అధికార దుర్వినియోగం చేయటంవల్లే గెలిచిందని ఆరోపించారు. గతంలోకంటే బీజేపీకి ఓట్లు పెరిగాయని దేవయ్య చెప్పారు.
వరంగల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతాడని, వరంగల్ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీనేతలు మొన్న ప్రచారంలో చెప్పారు. అయితే ఆ విషయాన్ని ప్రధానమంత్రి చెప్పిఉంటే గెలిచేవాడినని దేవయ్య అంటున్నారు.