వరంగల్ ఉప ఎన్నికలు ఎన్నికలలో తెరాస చాలా భారీ మెజార్టీతో విజయం సాధించబోతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది తమ పరిపాలనను మెచ్చుకొని ప్రజలు గెలిపించారని చెప్పుకొంటే మాత్రం అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు మొదలవకముందు వాటిని తెరాస ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండంగా భావించాలని కాంగ్రెస్ కోరినప్పుడు తెరాస నేతలు ఆ సవాలును దైర్యంగా స్వీకరించలేకపోయారు. కాంగ్రెస్ విసిరిన ఆ సవాలును ఒకవేళ వారు స్వీకరించి ఉండి ఉంటే, ఇప్పుడు వారు ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా విన సొంపుగా ఉండేది.
గత రెండు, మూడు వారాలుగా వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో తెరాస తన మంత్రులను నేతలను, పార్టీ శ్రేణులను దించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. తెరాస నేతలు చేసిన ఆ ‘సమిష్టి కృషి’ కారణంగానే వరంగల్ ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఘన విజయం సాధించబోతోంది. ఈ విషయం తెరాసకు తెలుసు, ఉప ఎన్నికలలో ఓడిపోతున్న ప్రతిపక్షాలకు తెలుసు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా ఎందుకు ప్రవేశించిందో కూడా అందరికీ తెలుసు. ఒకవేళ తమ ప్రభుత్వ పనితీరు పట్ల తెరాస నేతలే సంతృప్తి కలిగి దాని పట్ల ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నట్లయితే ఈ ఉప ఎన్నికల కోసం వారు అంతగా చెమటోడ్చవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ ఈ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడవలసివచ్చింది. కనుక తెరాస ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల ఫలితాలను చూసి మురిసిపోవడం కంటే, దీనినొక హెచ్చరికగా స్వీకరించి, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్న తనలో లోపాలను సవరించుకొని ముందుకు వెళితే డానికే మంచిది. అలాకాక ఇది తమ నిజమయిన విజయమేనని ఆత్మవంచన చేసుకొంటే దాని వలన అదే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.