హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ సునామీ సృష్టించిందని ఆ పార్టీ అగ్రనేత, తెలంగాణ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయని వ్యాఖ్యానించారు. తమపై దుష్ప్రచారం చేసిన మీడియా వర్గం ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటుందని అడిగారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరింత ఎక్కువగా, మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరణనిచ్చారని ట్వీట్ చేశారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ కవిత వరంగల్ ఫలితంపై స్పందిస్తూ, తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించటానికి ప్రజలు మరో అవకాశాన్ని ఇచ్చారన్నారు. ఈ ఫలితంతో మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముంబాయిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఫలితంపై స్పందిస్తూ చిల్లర ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశీర్వదించారని అన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరుకు ఇది రిఫరెండమ్ అన్నారు. జాతీయపార్టీలకు తెలంగాణలో మనుగడలేదని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ ఇదే ప్రభంజనం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికే ఆదర్శంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. సంక్షేమ పథకాలనూ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని అన్నారు. నారాయణఖేడ్ ఉపఎన్నికలోనూ విజయం సాధిస్తామని చెప్పారు.