వరంగల్ ఉప ఎన్నికలలో తెదేపా-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా తెదేపా తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయాలని ఉత్సాహపడ్డారు. కానీ బీజేపీలో బలమయిన అభ్యర్ధి లేకపోయినప్పటికీ ఆ సీటు తమకే కావాలని పట్టుబట్టి మరీ తీసుకొంది. పార్టీలో బలమైన అభ్యర్ధి ఎవరూ లేకపోవడంతో, రాజకీయాలలో ఎటువంటి అనుభవం లేని, స్థానిక ప్రజలకు పెద్దగా పరిచయంలేని డా. దేవయ్యను పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టింది. ఆయనకున్న ఆర్ధిక శక్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని, మిగిలిన ముఖ్యమయిన అంశాలను పట్టించుకోకుండా అభ్యర్ధిగా నిలబెట్టడం అతి పెద్ద తప్పు.
ఆయనను అభ్యర్ధిగా ప్రకటించినపుడే బీజేపీ ఓటమి, తెరాస విజయం దాదాపు ఖరారు అయిపోయిందని చెప్పవచ్చును. అదే తెదేపా మాటను మన్నించి దాని అభ్యర్ధికే ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చి ఉండి ఉంటే బహుశః ఫలితాలు మరోలా ఉండేవేమో? తమను కాదని డా. దేవయ్యకు అవకాశం ఇచ్చినప్పటికీ తెదేపా నేతలు ఆయన కోసం ప్రచారంలో పాల్గొన్నారు. అయినా కూడా ఆయన గెలవలేకపోయారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు డిల్లీ, బిహార్ ఎన్నికలలో పరాజయంతో క్రుంగిపోతున్న బీజేపీకి ఈ పరాజయం మరింత అవమానకరం తయారయింది. అయితే అందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరినో నిందించుకోవడం కంటే తమను తామే నిందించుకోవలసి ఉంటుంది.
ఈ ఉప ఎన్నికలలో నిలబెట్టేందుకే బీజేపీ వద్ద బలమయిన అభ్యర్ధి లేనప్పుడు, నిలబెట్టిన అభ్యర్ధిని గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్ధులను ఎక్కడి నుంచి అరువు తెచ్చుకొంటుంది? తెచ్చుకొన్నా ఏవిధంగా గెలవగలదు? అనే సందేహాలు కలగడం సహజం. ఇటువంటి దుస్థితిలో ఉన్న బీజేపి తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏవిధంగా అవతరించాలని కలలుకంటోందో వారికే తెలియాలి.
ఇంతకు ముందు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు, రాష్ట్రంలో బీజేపీ నేతలు కేవలం హైదరాబాద్ కే పరిమితమయ్యారని అని విమర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా బలోపేతం చేసుకోవాలో ఆయన వారికి మార్గ నిర్దేశం చేసారు. కానీ ఆయన సలహాలను వారెవరూ పట్టించుకొన్నట్లు లేదు అందుకే ఈ పరాజయ పరాభవం తప్పలేదు. వరంగల్ ఉప ఎన్నికలు జరుగుతాయని చాలా కాలం క్రితమే తెలిసినా ఎటువంటి ముందస్తు సన్నాహాలు చేసుకోకుండా కాలక్షేపం చేసి ఆఖరి నిమిషంలో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధి కోసం పరుగులు తీసారు. వారి నిర్లక్ష్యానికి పార్టీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. అదే ఈ అవకాశాన్ని తెదేపాకు విడిచిపెట్టి ఉండి ఉంటే, ఒకవేళ తెదేపా ఓడిపోయినా అది తెదేపా ఖాతాలో జమా అయ్యేది, బీజేపీకి ఈ అవమానం, విమర్శలు తప్పేవి.
తెలంగాణాలో తమకి ఏపాటి బలం ఉందో అంచనా వేసుకోవడంలో ఘోరంగా విఫలమయిన బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకొంటూ ఈ ఉప ఎన్నికల గోదాలోకి దిగి భంగపడ్డారు. కనీసం ఇప్పటికయినా మేల్కొని గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకొంటూ, తెదేపాతో బలమయిన బంధం ఏర్పరచుకోగలిగితే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆలోచించవచ్చును. లేకుంటే ఇదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా.