హైదరాబాద్: నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వరంగల్ ఉపఎన్నిక ఫలితంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడించేందుకు తెలుగుదేశంతో సహా అన్ని ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ ఎంపీ చేసే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటంలేదు. అయితే అప్పటి పరిస్థితులెలా ఉంటాయో చెప్పలేము కాబట్టి పూర్తిగా కొట్టిపారేయలేముకూడా.