హైదరాబాద్: స్వర్ణ దేవాలయం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల పుణ్యక్షేత్రంలో, చిత్తూరుజిల్లా శ్రీపురంలోకూడా స్వర్ణ దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాష్ట్రంలో మొట్టమొదటి స్వర్ణదేవాలయంగా చరిత్రకెక్కబోతోంది.
లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టుగా ఇస్కాన్ అనుబంధ సంస్థ ‘హరేకృష్ణ మూవ్మెంట్’ నిర్మిస్తున్న ఈ ఆలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. నాలుగైదు నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. రు.100 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఇప్పుడు రు.10 కోట్లతో బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఇస్కాన్‌కు 48 ఎకరాల స్థలం ఉండగా 44 ఎకరాలను ప్రభుత్వం ఆక్రమించుకుందని, మిగిలిన 4 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చరిత్రాత్మక కట్టడంగా నిర్మిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు చెప్పారు. ఇది పూర్తయితే ఆధ్యాత్మిక పర్యాటకం కింద వారానికి లక్షమంది భక్తులు వస్తారని అన్నారు. ఇందులో మల్టీపర్పస్ ఆటోమేటిక్ బ్లాక్, ఛారిటీ కళ్యాణమండపం, నిత్యాన్నదానం, మెడిటేషన్, యోగ, గ్రంథాలయం, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రమోషన్ బ్లాక్ నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తామని, ఆరునెలల్లో గర్భాలయ ప్రాకారాలు పూర్తిచేసి దర్శనం కల్పిస్తామని చెప్పారు.
యూపీలోని మధురలోని బృందావనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం నిర్మిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కందివద్ద రు.25 కోట్లతో శాశ్వత కిచెన్ సెంటర్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఇన్ఫోసిస్ సంస్థ నిర్మిస్తుందని తెలిపారు. ప్రస్తుతం పటాన్ చెరువువద్ద ఉన్న కిచెన్ సరిపోవటంలేదని వెల్లడించారు.