హైదరాబాద్: ఇవాళ వెలువడిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు కేశవరావు, నాయని, తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికద్వారా వరంగల్ ప్రజలు ప్రతిపక్షాలకు తగిన గుణపాఠాన్ని చెప్పాయని అన్నారు. ఆంధ్రజ్యోతి సృష్టించిన కృత్రిమ ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు నమ్మి తమ మనసులలో కూడా పెంచుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల విమర్శలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ కేసీఆర్ సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి వారిని బాగా ఎగదోసిందని అన్నారు. అబద్ధాలను, అర్ధసత్యాలను ప్రచారం చేశారని విమర్శించారు. మంచి సెక్రటేరియట్ కట్టుకుందామన్నా, మంచి కళాకేంద్రం నిర్మించుకుందామన్నా దుయ్యబట్టారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడ్డారని అన్నారు. వరంగల్ ప్రజల తీర్పును శిరోధార్యంగా భావించి విజృంభించి పనిచేస్తామని చెప్పారు. ఈ తీర్పుతో తమకు గర్వం రాదని అన్నారు.
ఉపఎన్నిక విజయం సందర్భంగా పలువర్గాలకు కేసీఆర్ వరాలను కురిపించారు. 2-3 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. త్వరలో డీఎస్సీ నిర్వహించి 15-20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. క్రిస్టమస్నాడు క్రైస్తవులకు దుస్తులు ఇస్తామని ప్రకటించారు. ఆశావర్కర్ల సమస్యలపై కేంద్రంతో పోరాడతామని చెప్పారు. చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని అన్నారు. వాటర్ గ్రిడ్‌ను రెండు-మూడేళ్ళలోనే పూర్తి చేస్తామని చెప్పారు. 2021 నాటికి కోటి ఎకరాలకు నీళ్ళిచ్చి చూపిస్తామని అన్నారు.
సంవత్సరకాలంగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్న విషయం నిజమేనని, ఈ కాలంలో తాను తెరవెనక వివిధ ప్రభుత్వ శాఖలకు వ్యూహకల్పన చేస్తున్నానని చెప్పారు. జనవరినుంచి జనంలోనే ఉంటానన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనూ విజయం సాధిస్తామని సర్వేలు చెబుతున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.