హైదరాబాద్: డిసెంబర్ 23 నుంచి 27 వరకు తాను జరపబోయే ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇవాళ వరంగల్ ఉపఎన్నిక ఫలితంపై మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఫాంహౌస్ సమీపంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాగంపై సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి విమర్శలనుకూడా కేసీఆర్ ప్రస్తావించారు. సురవరం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అలాంటి పెద్దమనిషి తన యాగంపై అర్థంలేని విమర్శలు చేయటంతో తాను బాధపడ్డానని చెప్పారు. కేసీఆర్ ఈ యాగాన్ని సొంత డబ్బులతో చేసుకోవాలని ఆయన అన్నారని వెల్లడించారు. తాను ఈ యాగాన్ని పూర్తిగా సొంత డబ్బుతోనే చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించానని, ఆయన వస్తానని చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. చంద్రబాబు వస్తారని, కొందరు గవర్నర్లు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.