వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించిన సందర్బంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పడం విశేషం. ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న జంట నగరాలలో ఒంటరిగా పోటీ చేసి నెగ్గుకు రాలేమని కేసీఆర్ భావించినందునే ఇంతకాలం ఆయన మజ్లీస్ పార్టీని దువ్వుతున్నారు. మజ్లీస్ నేతలను ప్రసన్నం చేసుకోనేందుకే ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా భారం అవుతున్నప్పటికీ మెట్రో రైలు మార్గాన్ని అష్ట వంకర్లు తిప్పడానికి కూడా వెనుకాడలేదు.
మజ్లీస్ పార్టీ మద్దతుతో జి.హెచ్.ఎం.సి. బోర్డును కైవసం చేసుకొందామని ఇంతవరకు భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించగానే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస ఎవరితో పొత్తులు పెట్టుకాకుండా జి.హెచ్.ఎం.సి.లో ఉన్న 150 డివిజన్లలో 80 కంటే ఎక్కువ డివిజన్లు గెలుచుకోగలమని నమ్మకంగా చెప్పాడం విశేషం. అంతే కాదు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా తెరాస ఘన విజయం సాధిస్తుందని తెలిపే సర్వే నివేదికలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అంటే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస ఇక మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకోబోదని స్పష్టం అవుతోంది. అలాగే కేసీఆర్ ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకొన్నది కాదని కూడా అర్ధమవుతోంది.
ఒకవేళ ఆయన తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే అందుకు కాంగ్రెస్ పార్టీ అందరి కంటే ఎక్కువ సంతోషించవచ్చును. ఒకవేళ మజ్లీస్ పార్టీతో తెరాస పొత్తులు పెట్టుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ తో మళ్ళీ చేతులు కలుపవచ్చును. మజ్లీస్ పార్టీకి కూడా కాంగ్రెస్ వంటి బలమయిన పార్టీ అందండలు చాలా అవసరం కనుక అది కూడా కాంగ్రెస్ అందిస్తున్న స్నేహ హస్తం మళ్ళీ అందుకోవచ్చును. కానీ కేసీఆర్ తన మాటకు కట్టుబడి ఉంటారా లేదా అనేది ఖచ్చితం తేలితే గానీ మజ్లీస్ పార్టీతో కాంగ్రెస్ చేతులు కలుపుతుందో లేదో తేలదు.