గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఇవ్వాళ (నవంబర్ 24) కోతినుంచి మానవుడు పుట్టాడన్న పరిణామక్రమం తెలుపుతూ డూడిల్ ఒకటి ప్రత్యక్షమైంది. ఏమిటా అని ఆరాతీయడం కోసమే గూగుల్ ఈ డూడిల్ ఉంచింది. నిజంగానేఇది ఆసక్తికరమైన అంశం. మానవజాతి `ముత్తవ్వ’ను తలుచుకోవడంకోసమే గూగుల్ ఈ ప్రయత్నం చేసింది. థాంక్స్ టు గూగుల్.
నాలుగుకాళ్ల మీద నడిచే జంతువు నుంచి నిటారుగా నిలబడి రెండుకాళ్లమీద నడిచే జంతువు (మనిషి) ఆవిర్భవించిందని జీవపరిణామశాస్త్రవేత్తలు చెబుతుంటారు. కోతిని పోలిన జీవుల నుంచి మానవజాతి హఠాత్తుగా ఏర్పడలేదు. కొన్నివేల సంవత్సరాల పరిణామక్రమంలో ఈ మార్పు సంభవించింది. మధ్యలో అనేక జాతులు, ఉపజాతులు ఆవిర్భవించాయి. మానవజాతికి ముత్తవ్వలాంటి జాతిని శాస్త్రవేత్తలు కనుక్కుని ఇవ్వాళ్టికి సరిగా 41 సంవత్సరాలైంది. ఆ పెద్ద ముత్తవ్వకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు- లూసీ.
ఎప్పుడో 32లక్షల సంవత్సరాల క్రిందట ప్రస్తుత ఇథియోపియా ప్రాంతంలో ఈ ముత్తవ్వ మనలాగానే సంచరించింది. శిలాజావస్థలో ఆమెకు సంబంధించిన ఎముకలను సేకరించి ఒక రూపాన్ని తీర్చిదిద్ది దానికి లూసీ అని పేరుపెట్టారు. ప్రస్తుత మానవజాతికి దగ్గర పోలికలున్న లూసీ Australopithecus afarensis జాతికి చెందినదిగా భావించారు. ఈ జాతి జంతువులు (మానవాకార జంతువులు) ఇథియోపియాలో లక్షల సంవత్సరాల క్రిందట సంచరిస్తుండేవి. 1974లో లూసీ శిధిల ఎముకలను 40శాతం వరకు సేకరించగలిగారు. ఎప్పుడో లక్షలాది సంవత్సరాల క్రిందట శిధిలమైన లూసీ శరీరంలోని 40 శాతం ఎముకులను సేకరించడమంటేనే చాలా గొప్ప. అందుకే ఇది సంపూర్ణ విజయం క్రిందలెక్క.
లూసీ పేరు ఎలా పెట్టారంటే…
శిలాజాల అధ్యయన శాస్త్రవేత్త డోనాల్డ్ జాన్సన్ 1974 నవంబర్24న తనకు దొరికిన ఎముకుల గూడుకు లూసీ అని పేరుపెట్టారు. ఆయన బృందంలోని పామెలా ఆల్డెర్మన్ అప్పటికే పాపులరైన పాట (లూసీ ఇన్ ద స్కై విత్ డైమండ్స్…)లోని లూసీ పేరునే పెట్టాలని సలహా ఇచ్చారు. చివరకు అదే పేరు ముత్తవ్వకు పెట్టారు. అప్పటి నుంచి ఈ మత్తవ్వ మానవజాతి పూర్వీకురాలు లూసీగా గుర్తింపుపొందింది.
నడక నేర్చిన ముత్తవ్వ
లూసీ ముత్తవ్వకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె రెండుకాళ్ల మీద నిలబడి నడిచేది. శిలాజ ఎముకలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాలి ఎముకలు నిటారుగా ఉన్నాయి. మోకాలు, వెన్నుముక పొజిషన్స్ బట్టి లూసీ నడిచేదని తేలింది. అయితే ఈ ముత్తవ్వ చాలా పొట్టిదనే చెప్పాలి. మూడుఅడుగుల ఏడంగుళాలు ఎత్తు ఉండేదట. బరువు 29 కిలోలు. చేతివేలు ఎముకలు వంకరగా ఉండటాన్నిబట్టి ఇంకా చెట్టుకొమ్మలు పట్టుకునే అలవాటు పోలేదని తేలింది.
ఆమె మరణం ఓ మిస్టరీ…
లూసీ ఎలా మరణించిందన్నది మిస్టరీనే. ఆమెను ఏదైనా క్రూరజంతువు చంపేసిందా ? లేక సహజమరణమా? అన్నది తెలియదు. ఆమె అస్థిపంజరంపై క్రూరమృగాలు దాడిచేసినట్లు ఎక్కడా పలుచోట్ల గాట్లు పడలేదు. ఈ కారణంగా ఆమెపై ఏ జంతువుదాడిచేసి చంపితినలేదని అనుకోవచ్చు. అయితే, ఒక ఎముకపై గాటుఉంది. ఈ ఒక్క గాటుతో ఆమెను జంతువు చంపితినిందని చెప్పలేమనీ, లూసీ చనిపోయిన తర్వాత ఏ జంతువైనా కొరకడంవల్ల కూడా ఇలాంటి గాటు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పుట్టిన చోటే లూసీ అస్థిపంజరం
లూసీ అస్థిపంజరాన్ని ఇథియోపియా నేషనల్ మ్యూజియంలో అత్యంత భద్రంగా ఉంచారు. అయితే ప్రజల సందర్శనార్థం ప్లాస్టెర్ రెప్లికాను అందుబాటులో ఉంచారు.
అలాంటి లూసీని స్మరించుకుంటూ గూగుల్ తన అనుబంధ లోగో (డూడిల్)ని ఏర్పాటుచేయడం ప్రశంసనీయం. మానవజాతి ఆవిర్భవానికి కారణమైన ముత్తవ్వ లూసీకి మనం కూడా కృతజ్ఞతతో శ్రద్ధాంజలి ఘటిద్దామా…
– కణ్వస