ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కు పెద్ద స్పందన కనిపించడం లేదు. మొదటి వారంరోజుల్లో ఈ పథకం ద్వారా కేవలం 400 గ్రాములను మాత్రమే ఆకర్షించగలిగింది.
అతి సామాన్యులు కూడా ఎంతో కొంత బంగారాన్ని కొంటారు. పిల్ల పెళ్ళికో, పిల్లాడి చదువుకో, తల్లి వైద్యానికో, పొలం మీద పెట్టుబడికో, తెలియకుండా విరుచుకు పడే అత్యవసరానికో పనికొస్తుందన్నది బంగారం కొనడంలో ఉద్దేశం. జీవన భద్రతకు కూడబెట్టుకోవాలన్న డొమెస్టిక్ సేవింగ్స్ కాన్ సెప్టు భారతీయుల్లో వున్నంతగా మరేజాతికీ లేదు. ఈ డొమెస్టిక్ సేవింగ్స్ ఫలితంగా దేశవ్యాప్తంగా ఇళ్ళలో 20 వేల టన్నుల బంగారం వుందని అంచనా వేశారు.
కమోడిటీస్ మార్కెట్ టెర్నినాలజీ ప్రకారం ఇది నిరుపయోగమైన నాన్ పెర్ఫార్మింగ్ ఎస్సెట్ (ఎన్ పిఎ) దీన్ని పెర్ఫార్మింగ్ ఆస్ధి గా మార్చే లక్ష్యంతో ఇళ్ళల్లో , దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేసిదానిపై ఆకర్షణీయమైన వడ్డీ సంపాదించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. దీంతో పాటు ప్రభుత్వం పేపర్ గోల్డ్, (గోల్డ్ బాండ్)లను ప్రారంభించింది.
మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న 20 వేలటన్నుల బంగారాన్ని చలామణిలోకి తెచ్చి దాని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పురోగతిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టు కున్నా.. ప్రజలకు బంగారంతో ఉన్న సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారిని ఒప్పించి బ్యాంకు ల్లో డిపాజిట్ చేయించడం మోడీ ప్రభుత్వానికి అతి పెద్దసవాలేనని కేవలం 400 గ్రాములే డిపాజిట్ అవ్వడాన్ని బట్టి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం బంగారాన్ని మదుపు చేసే సెంటర్ల కొరతే అని అధికారులు చెబుతున్నారు. ఏడాది చివరి నాటికి 55 బంగారం పరీక్షల సెంటర్లను, గోల్డ్ డిపాజిట్ బ్యాంకు బ్రాంచీలను లను ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది.