ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.700 కోట్లు విడుదల చేసిన్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో భాగం ఈ నిధులను నవంబర్ 23న విడుదల చేసినట్లు తన ప్రకటనలో పేర్కొంది. దీనిలో రూ. 350 కోట్లు అమరావతి నిర్మాణానికి, మిగిలిన మొత్తం రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఏడు జిల్లాలలో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున కేటాయించినట్లు పేర్కొంది. ఇంతకు ముందు ఒకసారి ఈ ఏడు జిల్లాల అభివృద్ధికి కేంద్రం రూ. 350 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి త్వరలో రూ.300 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఈవిధంగా నిధులు విడుదల చేస్తుండటం హర్షణీయమే కానీ ఆరేడు నెలలకొకసారి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున కేటాయించడం వలన నిజంగా అభివృద్ధి సాధ్యమేనా కాదా? కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలలో అభివృద్ధి పనులు చేపడుతోందా? లేక ఆ నిధులను వేరే అవసరాలకు ఉపయోగిస్తోందా? అని పరిశీలించవలసిన అవసరం ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ వ్రాయగానే కేంద్రప్రభుత్వం రూ.900 కోట్లు తుఫాను నష్ట పరిహారం విడుదల చేసింది. తమిళనాడుతో బాటు ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతాలు కూడా అదే తుఫానులో తీవ్రంగా నష్టపోయాయి. కానీ ఆంధ్రాకు నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు? వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆ రాష్ట్రానికి అడిగినంతా నిధులు విడుదల చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికలకు ముందు రూ.1.65 లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల కావాలంటే ఎన్నికల సమయం దగ్గర పడేవరకు అంటే 2018 వరకు వేచి చూడాలేమో? ప్రస్తుతానికి, ఏడాదిన్నర క్రితం ఇచ్చిన హామీలని వాయిదాల పద్దతిలో అమలుచేస్తోంది!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడం లేదని స్పష్టం అయిపోయింది కనుక కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అయినా మంజూరు చేస్తుందని ప్రభుత్వం, ప్రజలు, ఆశగా ఎదురు చూస్తున్నారు. బిహార్ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు అవుతుందని తెదేపా నేతలు చెప్పుకొన్నారు. బిహార్ ఎన్నికలయిపోయాయి. కానీ ఇంతవరకు ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. బిహార్ ఎన్నికలు పూర్తవగానే ప్రధాని నరేంద్ర మోడి జమ్మూ కాశ్మీర్ పర్యటించి ఆ రాష్ట్రానికి రూ. 80,000 కోట్ల భారీ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటికీ ఇలాగ వాయిదాల పద్దతిలో నిధులు విడుదల చేస్తూ సరిపెట్టేస్తున్నారు. అందుకు సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు.
ప్రత్యేక హోదా అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉందని చెపుతూ దానిని పక్కన పడేసినట్లే, రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇదే టెక్నిక్ ప్రయోగిస్తూ కేంద్రప్రభుత్వం రోజులు దొర్లించేస్తోంది. బహుశః ఆర్ధిక ప్యాకేజీ కోసం ‘రోడ్ మ్యాప్ తయారు’ చేయడం అనే సాకుతో దానిని కూడా పక్కన పడేసే ఆలోచనలో ఉందేమో? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగట్లేదు.