బీహార్లో ఘోర పరాజయం. వరంగల్ లో డిపాజిట్ గల్లంతు. బీజేపీకి అచ్ఛే దిన్ కు బదులు బురే దిన్ నడుస్తున్నాయి. మధ్య ప్రదేశ్ లోని రత్లాం లోక్ సభ సీటును కమలనాథులు నిలబెట్టుకోలేకపోయారు. కాంగ్రెస్ కు కంచుకోటైన రత్లాం సీటును బీజేపీ 2014లో తొలిసారిగా గెల్చుకుంది. అయితే ఆ పార్టీ ఎంపీ దిలీప్ భూరియా ఇటీవల మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ బీజేపీని గెలిపించడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గల్లీ గల్లీల్ ప్రచారం లేకపోయినా ఫలితం లేకపోయింది. అయితే, ఇదే రాష్ట్రంలోని దేవాస్ అసెంబ్లీ సీటును మాత్రం బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది.
రత్లాం ప్రజలు బీజేపీకి షాకిస్తే, ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ని ప్రజలు ఊహించని విజయాన్నిచ్చారు. మణిపూర్ లో ఉప ఎన్నికలు జరిగిన రెండు సీట్లనూ కమలనాథులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కు షాకిచ్చారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ రెండు సీట్లను గెల్చుకోవడం ఆ పార్టీకే వారికే నమ్మశక్యం కాకుండా ఉంది.
మరో ఈశాన్య రాష్ట్ర మిజోరంలో మాత్రం ఉప ఎన్నిక జరిగిన ఒక్కసీటూ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఐజ్వాల్ నార్త్ 3 నియోజకవర్గంలో విజయం సాధించారు.
మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు లోక్ సభ పరంగా బీజేపీకి గట్టి షాకిచ్చాయి. రత్లాంలో ఉన్న సీటును చేజార్చుకోవడం, వరంగల్ లో కనీసం డిపాజిట్ దక్కకపోవడం కమలనాథులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత దీనిపై సమీక్ష జరగవచ్చు.