బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ భారత్ లో మత అసహనం పెరిగిపోతోందని చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. ఇప్పుడు ప్రముఖ సంగత దర్శకుడు ఏఆర్ రహమాన్ కూడా అసహనం పల్లవి ఆలపిస్తున్నారు. అయితే అందుకు పేర్కొన్న కారణాలు, తన వాదనను సమర్ధించుకొంటున్న విధానం రెండూ చాలా విచిత్రంగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన “ముహమ్మద్-మెసెంజర్ ఆఫ్ గాడ్” అనే ఒక ఇరానీ సినిమాకు సంగీతం సమకూర్చినప్పుడు, అందుకు ఆగ్రహించిన ‘రజా అకాడమీ’ అనే ముస్లిం మత సంస్థ ఆయనకు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేసింది. అది దేశంలో పెరుగుతున్న మత అసహనానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దేశంలో వివిద రంగాలకు చెందిన ప్రముఖులు దేశంలో మత అసహనం పెరిగిపోతోందని వాదిస్తూ గత రెండు మూడు నెలలుగా తమ అవార్డులను కేంద్రప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. దానిపై స్పందించిన ఏఆర్ రహమాన్, “మహాత్మాగాంధీ సూచించిన అహింసా పద్దతిలో వారు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఒకరినొకరు కొట్టుకోకుండా ఈవిధంగా నిరసనలు తెలియజేయడం కవితాత్మకంగా ఉంది. అవసరమయినప్పుడు తిరుగుబాటు చేయవచ్చును కానీ అది చాలా హుందాగా ఉండాలి. దేశంలో ప్రముఖులు ఇప్పుడు అలాగే తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి,” అని అన్నారు. దేశంలో ముస్లింలు అభద్రతాభావం కలిగి ఉన్నారా? అనే ప్రశ్నకు ఆ సంగతి తనకు తెలియదని ఆయన సమాధానం దాట వేశారు.