గత ఏడెనిమిది నెలలుగా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.
“ప్రజలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. మరి కొందరు తప్పుదారి పడుతున్నారు. ఈ రెంటిలో ఎవరు ఏ వర్గానికి చెందుతారో నేను చెప్పదలచుకోలేదు. కానీ ఇటువంటి విష ప్రచారం మన దేశానికి ఏమాత్రం మేలు చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ప్రధాని నరేంద్ర మోడి కేవలం అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయలనుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో, కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి కానీ ఆ సంఘటనలను కూడా మోడీ ప్రభుత్వానికే ఆపాదించి మత అసహనం పెరిగిపోతోందని కొందరు పనికట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు.”
“బీజేపీని, మోడీని వ్యతిరేకించే కొందరు ప్రముఖులు సార్వత్రిక ఎన్నికల సమయంలో మా పార్టీని ఓడించమని కోరుతూ ప్రచారం చేసిన సంగతి మాకు తెలుసు. అటువంటివారే కొందరు తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ ఈ విషప్రచారంలో పాలుపంచుకొంటున్నారని నేను భావిస్తున్నాను. మా ప్రభుత్వంలో అవినీతి అదుపులోకి వచ్చింది. మత ఘర్షణలు తగ్గాయి. విదేశాలలో మన పలుకుబడి పెరిగింది. దేశం ఆర్ధికంగా బలపడుతోంది. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక కొందరు పనిగట్టుకొని మా ప్రభుత్వానికి వ్యతిరకంగా ఈ విషప్రచారం ఆరంభించారు. దానిలో కొందరు ప్రముఖులు కూడా పాలుపంచుకోవడం చాలా దురదృష్టకరం. దేశాభివృద్ధి గురించి ఆలోచించవలసిన సమయంలో మన దేశ పరువు ప్రతిష్టలు మనమే మన చేతులతోనే మంటగలుపుకోవాలనుకోవడం చాలా శోచనీయం,” అని అన్నారు.