హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత దారుణంగా, డిపాజిట్ కోల్పోయేటంత స్థాయిలో ఓడిపోతామని ఆ పార్టీ నేతలు ఎవరూ ఊహించలేదు. ఓటమి షాక్ నుంచి ఒకరొకరుగా తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు బయటకొచ్చి ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్లు భయంతోనే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చెప్పారు. ఓటువేయకపోతే సంక్షేమ పథకాలను ఆగిపోతాయని టీఆర్ఎస్ నేతలు బెదిరించారని అన్నారు. ప్రశ్నించిన వారిని జైళ్ళలో పెడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. వరంగల్ విజయంతో ప్రజలు తమవైపే ఉన్నారని తేలిందంటున్న కేసీఆర్, టీఆర్ఎస్లోకి పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. తమ సవాల్‌ను కేసీఆర్ స్వీకరిస్తారనే భావిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు వరంగల్ ఫలితంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని వరంగల్ ప్రజలు నమ్మలేదని అన్నారు. ఓటమికి సమష్ఠి బాధ్యత వహిస్తామని చెప్పారు. ఓటమిని విశ్లేషించుకుని ముందుకు వెళతామని అన్నారు. 2019లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని, వాటిని గురించి ఇప్పుడే మాట్లాడటం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ క్యాడర్ ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మెచ్చేవిధంగా పనిచేయాలని కోరారు. వరంగల్ ప్రచారంలో టీఆర్ఎస్కు తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, మూడేళ్ళలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతాంగానికి నీళ్ళిస్తే టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తానని జానారెడ్డి అన్నారు.