వరంగల్ ఉప ఎన్నికలలో ఓటమి తరువాత కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తెదేపాతో పొత్తులు పెట్టుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. మరో కాంగ్రెస్ నేత కే. జానా రెడ్డి మాట్లాడిన మాటలు వింటే గుత్తా ఆ మాట ఏదో యాదృచ్చికం అనలేదని అర్ధం అవుతోంది. 2019 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీతో అయినా కాంగ్రెస్ పొత్తులు పెట్టుకొనే అవకాశం ఉందని కానీ పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మరో బలమయిన పార్టీ కోసం చూస్తోందని అర్ధం అవుతోంది. అయితే గుత్తా చెప్పిన ప్రకారం తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం సాధ్యమేనా అనే అనుమానం కలుగుతోంది.
తెలంగాణాలో తెదేపా క్రమంగా బలహీనపడుతోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు తన పార్టీనే పణంగా పెట్టడానికి సిద్దపడుతున్నట్లున్నారు. కానీ అదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెదేపా కంటే బీజేపీతో చేతులు కలపడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నిజానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలోనే బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనుకొన్నారు. కానీ తెదేపా దానితో పొత్తులు పెట్టుకోవడంతో ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ, రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రం అరకొర నిధులు విడుదల చేస్తుండటంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయో ఈలోగానే తెగతెంపులు చేసుకొంటాయో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆ రెండు పార్టీలు తెగ తెంపులు చేసుకొన్నట్లయితే తెలంగాణాలో వేరే పార్టీ (తెరాస?)తో పొత్తులు పెట్టుకొంటే మంచిదని బీజేపీ భావిస్తే ఆశ్చర్యమేమీ లేదు. అది తెరాస అయినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ తెరాస, బీజేపీలు చేతులు కలిపితే, అప్పుడు తెలంగాణాలో తెదేపాను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తమతో చేతులు కలుపుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారేమో? ఏమో? అయినా జానారెడ్డి చెప్పినట్లు పొత్తులు రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాల సమయం ఉంది కదా!