హైదరాబాద్: వంటింట్లో ఉపయోగించే పసుపు, కారం, దనియాలు, జీలకర్ర నుంచి బ్రాండెడ్ బ్యాగ్‌లు, మెమరీ కార్డ్‌లు, మొబైల్ ఫోన్స్, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ వరకూ కాదేదీ కల్తీకి-నకిలీకి అనర్హం అన్నట్లు మారిపోయింది. విజయవాడలో టన్నులకు టన్నులు నకిలీ బ్రాండ్ మసాలా దినుసులను తయారీ చేసే కార్ఘానాను పోలీసులు పట్టుకున్నారు. ఆవుల ఫణికుమార్, అనిల్ అనే బావ-బావమరుదులు కలిసి నందిని అనే నకిలీ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పసుపు, కారం, జీలకర్ర, దనియాలు, సేమ్యాలను తయారుచేస్తున్నారు. నకిలీది అన్నా ఎవరూ నమ్మలేనివిధంగా తయారుచేయటం వీరి ప్రత్యేకత. పైగా అరెస్టయిన సందర్భంగా విలేకరులు అడిగితే, కల్తీ చేయటంలేదని ఇవన్నీ మంచి పదార్థాలనేనని, కాకపోతే అనుమతులు తీసుకవాలని తనకు తెలియదంటూ అమాయకంగా కబుర్లు చెబుతున్నాడు. ఇతను జంతు కళేబరాలతో డల్డా తయారు చేసి దానిని నెయ్యిగా నమ్మిస్తూ సరఫరా చేస్తున్నాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, విజయవాడ సింగ్ నగర్, అడవినెక్కలలో ఇతనికి కల్తీ పదార్థాల తయారీ యూనిట్లు ఉన్నాయి.
హైదరాబాద్‌లోకూడా పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. అన్మోల్ స్పైసెస్ అనే బ్రాండ్ పేరుతో ఇక్కడ నెయ్యి, నకిలీ మిరియాలు, పసుపు, జీలకర్ర, గసగసాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. బొప్పాయి గింజలకు సింథటిక్ గమ్, మైదా, రెడ్ ఆక్సైడ్ కలిపి మిరియాలుగా మారుస్తున్నారు. బొంబాయి రవ్వకు రాళ్ళపొడి, మైదా, పెయింట్స్, గ్లూకోజ్, సోడియం హైడ్రో సల్ఫైట్, లిక్విడ్ జాంగ్రీలను కలిపి గసగసాలను తయారు చేస్తున్నారు. ఇక జీలకర్రలో బ్లాక్ ఆక్సైడ్, సింథటిక్ గమ్, రెడ్ ఆక్సైడ్, వైట్ ల్యూబ్రికెంట్ ఆయిల్, నకిలీ పెప్పర్, స్టోన్ పౌడర్, గోడలకు వేసే పెయింట్, సోడియం హైడ్రో సల్ఫైట్ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
ఇక లగేజ్ బ్యాగ్‌లు, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, మెమరీ కార్డ్‌లు, మొబైల్ ఫోన్స్కుకూడా నకిలీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒరిజినల్ ఏదో, నకిలీ ఏదో తెలియని అమాయక కొనుగోలుదారులు వీటిని కొని మోసపోతున్నారు. ఇటీవల ఆటోమొబైల్ వాహనాల తయారీ సంస్థ మహేంద్ర, అమెరికన్ లగేజ్ తయారీ సంస్థ శాంసొనైట్ సంస్థల ప్రతినిధులు తమ ఉత్పత్తులకు నకిలీలు తయారుచేస్తున్నారంటూ హైదరాబాద్‌లో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులననుసరించి మేడ్చల్, దిండిగల్ ప్రాంతాలలో పోలీసులు దాడులు జరపగా, భారీ మొత్తంలో మహేంద్ర కంపెనీవారి నకిలీ స్పేర్ పార్ట్స్ దొరికాయి. ఇక బ్యాగ్‌ల విషయంలో సుల్తాన్ బజార్లో దాడులు జరపగా ఒక్క దుకాణలోనే శాంసొనైట్ వారి 85 నకిలీ బ్యాగ్‌లు పట్టుబడ్డాయి. ఒరిజినల్ ఏదో, నకిలీ ఏదో తెలియనంతగా నకిలీ ఉత్పత్తులు తయారవటం విశేషం. ఈ రెండు సందర్భాలలోకూడా ఒరిజినల్ తయారీదారులు ఫిర్యాదు చేయబపట్టి ఇవి బయటకు వచ్చాయిగానీ లేకపోతే ఎవరికీ తెలియదు. ఎలక్ట్రానిక్ పరికరాలలోకూడా ఈ నకిలీలు భారీగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఐఫోన్లకు కూడా నకిలీలు తయారుచేస్తున్నారని తెలిపారు.