హైదరాబాద్: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా ఆమిర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్ బిజినెస్ పోర్టల్ ‘స్నాప్‌డీల్’కు సంకటంగా మారాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలకు నిరసనగా పెద్దఎత్తున వినియోగదారులు ఆ యాప్‌కు రేటింగ్స్ తగ్గించేశారు. ఈ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలంటూ సోషల్ మీడియాలో #AppWapsi అనే క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనిపై స్నాప్ డీల్ సంస్థ ఇవాళ వివరణ ఇచ్చింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఆమిర్ ఖాన్ వ్యక్తిగతమని, వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంది. ఆమిర్ ఖాన్ ఈ ఏడాది మార్చి నుంచి స్నాప్‌డీల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీనికిగానూ ఆ సంస్థ రు.15-20 కోట్లతో ఆమిర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఈ పరిణామంపై స్నాప్ డీల్ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్ కార్ట్ అధినేత సచిన్ బన్సాల్ మండిపడ్డారు. బ్రాండ్ అంబాసిడర్‌ల వ్యక్తిగత అభిప్రాయాలను బ్రాండ్‌లకు ఆపాదించకూడదని అన్నారు. స్నాప్ డీల్‌కు ఇలా జరిగిఉండికూడదని వ్యాఖ్యానించారు.
మరోవైపు కొందరు గోద్రెజ్ సంస్థపైకూడా సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు. వెంటనే గోద్రెజ్ సంస్థ రంగంలోకి దిగి ఆమిర్ ఖాన్‌తో తమకు సంబంధం లేదని, ఆయనతో తన యాడ్ కాంట్రాక్ట్ 2014 మార్చిలోనే ముగిసిపోయిందని వివరణ ఇవ్వాల్సివచ్చింది. గోద్రెజ్ సంస్థ ఐరన్ సేఫ్‌లకు ఆమిర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు.