కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ‘మత అసహనం’ అనే మాట భలే క్లిక్ అయిందనే చెప్పాలి. అదేదో భగవన్నామస్మరణ అన్నట్లు ఇప్పుడు దేశంలో అన్ని మతాలు, ప్రాంతాలవారు, మేధావులు,కళాకారులు, పామరులు అందరూ నిత్యం జపిస్తున్నారు. దానిని కనిపెట్టి జనల మీదకు వదిలిన కాంగ్రెస్ పార్టీ దాని వలన రాజకీయంగా చాలా ప్రయోజనం పొందుతుంటే, దానిని పట్టుకొని వ్రేలాడుతున్న అమీర్ ఖాన్ వంటి కొందరు మేధావులు ఎదురుదెబ్బలు తింటున్నారు. నలుగురితో నారాయణ అన్నట్లుగా అయన కూడా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోదామా? అని తన భార్య అడిగిందని చెప్పుకొని విమర్శలు మూటగట్టుకొన్నారు. నిజానికి అమీర్ ఖాన్ దేశభక్తిని శంఖించడానికి లేదు. ఆ విషయం ఆయన తీస్తున్న సినిమాలను చూస్తే అర్ధమవుతుంది. అయితే మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు నోరు జారకుండా ఉండడు. అందుకు ఎదురుదెబ్బలు తినకుండా ఉండడు. అమీర్ ఖాన్ కూడా అలాగే మత అసహనం గురించి తనకు తోచినది మాట్లాడి చిక్కులో పడ్డారని భావించవచ్చును. అందుకు ఆయన సంజాయిషీలు ఇచ్చుకొన్నారు కూడా. కనుక ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టడమే మంచిది.