భారతదేశంలో “మత అసహనం” అనే అంటూ రోగం వ్యాపిస్తోంది. కానీ అది కేవలం ఊహజనితమయిన ఒక అంటూ రోగమే తప్ప భౌతికంగా ఎటువంటి లక్షణాలు కనబడటం లేదు. ఈ అంటురోగం సామాన్య ప్రజల కంటే మేధావులు, కళాకారులకే ఎక్కువగా సోకుతుండటం విశేషం. కనుక దానికి వారే ఎక్కువ బాధపడుతున్నారు. అమీర్ ఖాన్ అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అయితే ఈ అంటురోగాన్ని దేశంలో వ్యాపింప జేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పక తప్పదు. ఎందుకంటే తమను ఎన్నికలలో చావు దెబ్బ తీసి, పార్లమెంటులో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన మోడీ ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవడానికేనని చెప్పవచ్చును.
అందుకు అది చాలా తెలివిగా వ్యూహం పన్నింది. బీజేపీకి మతతత్వ పార్టీ అనే బలమయిన ముద్ర ఉంది. దానికి ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. మోడీని, ఆయన ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బ తీయాలని తపించిపోతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీకున్న ఈ మతతత్వ ముద్రను తెలివిగా ఉపయోగించుకొని దాని మూలల మీద దెబ్బ తీయడానికే ఈ పదం కనిపెట్టి జనాల మీదకు వదిలింది. ప్రస్తుతం జనాల నోళ్ళలో అది నానుతున్న తీరు, దానికి మేధావులు, అమీర్ ఖాన్ వంటి గొప్ప కళాకారుల నుండి వస్తున్న స్పందన చూస్తున్నట్లయితే కాంగ్రెస్ వేసిన వ్యూహం చాలా అద్భుతంగా ఫలించిందని అర్ధం అవుతోంది.
ఈ చిన్న పదం కారణంగా బీజేపీ, మోడీ ప్రభుత్వం ఎంత అప్రదిష్ట పాలవుతోందో..ఎన్ని విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కొంటోందో…దానిని ఎదుర్కోలేక బీజేపీ నేతలు మోడీ ప్రభుత్వం ఎన్ని అవస్థలు పడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నంలో ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ పట్ల మళ్ళీ అనుమానాలు, అపోహలు కలిగే ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ పరిపాలించినపుడు భారత్ అంటే అవినీతి, కుంభకోణాలు అని ప్రపంచదేశాలకు ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడి దానిని పూర్తిగా తుడిచేసి భారత్ “అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్” అనే అభిప్రాయం కలిగించగలిగారు.
కానీ కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఒక “హిందూ మతోన్మాద దేశం..అక్కడ మిగిలిన మతాల వారిని హిందువులు నిత్యం చంపుతుంటారు,” అనే అభిప్రాయం ప్రపంచ దేశాలకు కలిగిస్తోంది. ఒకప్పుడు భారతదేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన యువరాజు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడికి ఏమాత్రం తీసిపోడు, ఆయన కంటే చాలా గొప్పవాడు…పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడు అని నిరూపించి చూపి, అతనికి పట్టాభిషేకం చేసేందుకే ఈ మత అసహనం అనే పదాన్ని కనిపెట్టి జనాల మీదకు వదిలిందని చెప్పవచ్చును.
చట్టాలు, పరిపాలన, ఆర్ధిక, సాంకేతిక విషయాలపై పెద్దగా పట్టులేని యువరాజావారు మోడీ కట్టి విడిచిపెట్టిన సూటునే పట్టుకొని వ్రేలాడుతుంటే, దానిని పట్టుకొని ఆయన రాజకీయాలలో పైకి ఎగబ్రాకలేరని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు ఈ మత అసహనం అనే చిన్న పదాన్ని సృష్టించి జనాల మేధకు వదిలారు. దానిపై మాట్లాడేందుకు పెద్దగా పరిజ్ఞానం అవసరం లేదు కనుక యువరాజా వారు దానిని పట్టుకొని బాగానే అల్లుకుపోగలిగినట్లు కనబడుతోంది.