ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత అకస్మాత్తుగా ఉద్యమం మొదలుపెట్టిందో అంతే అకస్మాత్తుగా దానిని పక్కన పడేసిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఉద్యమం చేసిన ఆ కొన్ని రోజులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే తపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదని విమర్శించింది. అందుకు ఒక అరడజను రుజువులు, సాక్ష్యాలు చూపించింది కూడా. అయితే చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపడంలేదని నిందించిన జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదాపై తను మొదలుపెట్టిన ఉద్యమాన్ని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపడేశారో, దాని గురించి ఇప్పుడు ఎందుకు ఇదివరకులాగా గట్టిగా మాట్లాడటం లేదో తెలియదు. కానీ నేటి నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి కనుక దానిలో మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని వైకాపా నిర్ణయించుకొంది.
ప్రత్యేక హోదాపై మళ్ళీ వైకాపాకి ‘మూడ్’ వచ్చింది కనుక మళ్ళీ తెదేపాను విమర్శించడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయమని చంద్రబాబు నాయుడు తన సభ్యులకు సూచించకపోవడాన్ని వైకాపా నేత బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. పార్లమెంటులో తమ ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు తమతో కలిసి రమ్మని కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక ఇతర అంశాలపై కూడా తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడబోతున్నారని వాటి కోసం తెదేపా ఎంపీలు కూడా తమ ఎంపీలతో కలిసి పోరాడాలని ఆయన కోరారు.
బొత్స సత్యనారాయణ చెపుతున్న మాటలు వింటే, కేవలం వైకాపా మాత్రమే రాష్ట్రం కోసం పరితపించిపోతోందని, తెదేపాకు ఏ మాత్రం శ్రద్ద లేదన్నట్లు చెపుతున్నట్లుంది. అలాగే బీజేపీకి తెదేపా మిత్రపక్షమని తెలిసి కూడా, తెదేపా ఎంపీలు తమతో కలిసి బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని కోరడం ఆ పార్టీని ఇరుకున పెట్టడానికేనని భావించవచ్చును. తెదేపా అందుకు అంగీకరించదని బొత్స సత్యనారాయణకు తెలుసు. అంగీకరించదు కనుక రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, హోదా, ప్యాకేజీ వంటి అంశాలపై తెదేపాకు ఏమాత్రం ఆసక్తి లేదని ప్రచారం చేసుకోవచ్చును.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా వైకాపా ఎంపీలతో చేతులు కలుపుతుందని ఎవరూ భావించలేరు. కానీ ఆ పార్టీ ఎంపీలు వైకాపా చెపుతున్న, చెప్పని ఇంకా అనేక ఇతర అంశాలపై గత 16 నెలలుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తప్పకుండా ఒత్తిడి చేస్తారు. కాకపోతే ప్రతిపక్ష పార్టీలాగ నిలదీయకుండా కొంత సౌమ్యంగా అడుగుతారు. ఈ సమావేశాలలో రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణానికి అదనపు నిధులు, పెండింగులో ఉన్న ఇతర ప్రాజెక్టులకి అనుమతుల గురించి అడగాలని తెదేపా ఎంపీలు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. కనుక తెదేపా చిత్తశుద్ధిని వైకాపా ప్రశ్నించనవసరం లేదు. తను చేసే పోరాటం నిజాయితీగా చేస్తే చాలు.