హైదరాబాద్: ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి పెళ్ళి చేశారని మన కవులు సాహిత్యంలో వర్ణించారు. కేరళకు చెందిన ఎన్ఆర్ఐ, బిజినెస్ టైకూన్ రవి పిళ్ళై తన కుమార్తె ఆరతి వివాహాన్ని అదే స్థాయిలో చేస్తున్నారు. ఇవాళ కేరళలోని కొల్లామ్‌లో జరిగే ఈ వివాహానికి పిళ్ళై అక్షరాలా రు.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. పెళ్ళికే రు.55 కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుందో అనే ఆలోచన రావటం సహజం. అవును! ఆయన ఆస్తి 2.8 బిలియన్ డాలర్లు. గల్ఫ్‌లో కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్, గనులు, విద్య రంగాలలో ఆయన వ్యాపారాలు చేస్తారు. ఆయనకున్న మొత్తం 26 సంస్థలలో 80,000మంది పనిచేస్తారు.
ఇక పెళ్ళి విషయానికొస్తే బాహుబలికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు శిరిలే ఈ పెళ్ళికీ సెట్టింగ్స్ వేశారు. 8 ఎకరాలలో 40,000 చదరపు అడుగులలో నిర్మించిన పెళ్ళి మండపం, స్వాగత ద్వారాలకోసమే రు.20 కోట్లు ఖర్చుపెట్టారు. స్వాగత ద్వారాలకోసం బాహుబలి సెట్టింగ్స్‌ను, మంటపంకోసం రాజస్థాన్ ప్యాలెస్‌లను ఆయన అనుసరించారు. ఇక మళయాళంలో ప్రముఖ హీరోయిన్లు మంజువారియర్, శోభన నృత్యాలు ఈ పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్టీఫెన్ డెవాస్సీ మ్యూజిక్ షో కూడా ఉంటుంది. 30,000 మంది అతిథులు హాజరవుతారు. పెళ్ళి సందర్భంగా రు.10 కోట్లతో దానధర్మాలుకూడా చేస్తున్నారు. ఇవాళ అతిథులను తరలించటంకోసం రెండు ఛార్టర్డ్ ఫ్లైట్స్‌ను వాడుతున్నారు. భద్రతా ఏర్పాట్లకోసం 250 మంది రాష్ట్ర పోలీసులు, 350మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పెట్టారు.