హైదరాబాద్: జనవరి 1 నుంచి అగ్రిగోల్డ్ గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని ఈ కుంభకోణంపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ హైకోర్ట్‌కు సూచించింది. ఈ కేసు ఇవాళ హైకోర్ట్‌లో విచారణకు వచ్చింది. సూర్యారావు కమిటీ సిఫార్సులను కోర్ట్ స్వీకరించింది. అగ్రిగోల్డ్‌పై మీడియాలో కథనాలను నిరోధించాలని సంస్థ తరపున న్యాయవాదులు హైకోర్ట్‌ను కోరారు. దీనికి కోర్ట్ నిరాకరించింది. ఈ కేసులో బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేసిన రమేష్‌బాబు కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మీడియా కథనాలవలనే ప్రజలలో చైతన్యం వచ్చిందని, ఆత్మహత్యలు ఆగాయని, బాధితులకు ఊరట కలిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీల పేరిట పెట్టిన ఆస్తుల వివరాలను తాము జడ్జికి తెలియజేశామని, వాటి విలువ రు.2,000 కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ చెప్పారు. అగ్రిగోల్డ్ యజమాని వెంకట్రామారావు – తన భార్య, పనివారు, డ్రైవర్‌లు తదితరుల పేరిట బినామీ ఆస్తులను రాశారని, వాటిని ఇప్పుడు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు అగ్రిగోల్డ్ గ్రూప్ బినామీ ఆస్తుల రెండో జాబితాను మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజి విడుదల చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం 147 సూట్ కేస్ కంపెనీలను పెట్టిందని ఆరోపించారు. రు.25,000 కోట్ల ఈ కుంభకోణం కారణంగా 80 మంది చనిపోయారని, 46 లక్షలమంది బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై నోరుమెదపకపోవటాన్ని తప్పుబట్టారు. అగ్రిగోల్డ్ గ్రూప్ యజమానులను ఉరితీయాలని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.