హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధించారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. తమ మహాకూటమికి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం అమలు చేస్తానని నితీష్ ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లకు వాగ్దానం చేశారు.
1977-78లో తాము మద్యనిషేధం విధించటానికి ప్రయత్నించామని, అది విజయవంతం కాలేదని నితీష్ అన్నారు. మద్యంవలన అందరికంటే మహిళలు ఎక్కువగా బాధపడుతున్నట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలు ఈ సారాను ఎక్కువగా తాగుతున్నారని, దీనివలన వారి కుటుంబాలు, వారి పిల్లల చదువులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని అన్నారు. నిషేధంపై కసరత్తు ప్రారంభించాలని, వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి దీనిని అమలు చేయాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి ఇవాళ ఒక కార్యక్రమంలో చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖా మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ బాధ్యతలు చేపట్టగానే మీడియాతో మాట్లాడినపుడు, మద్యనిషేధంకోసం తమ ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రారంభిస్తుందని చెప్పారు. మద్యనిషేధం విధించాలని చాలామంది కోరారని తెలిపారు. మహిళలు… అందులోనూ దళిత, వెనకబడిన కులాలకు చెందిన వారు మద్యం వినియోగం పెరిగిపోవటంపై నిరసనలు వ్యక్తం చేస్తూ, మద్యనిషేధాన్ని విధించాలని డిమాండ్ చేశారని చెప్పారు. అయితే ఈ నిషేధం నాటుసారా పైనా, లేక అన్నిరకాల మద్యాలపైనానా అనేది ఇంకా స్పష్టం కాలేదు. బీహార్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై పన్నులద్వారా ఏటా రు.3,500 కోట్లు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మరి ఈ లోటును ఎలా పూడ్చుకుంటారో చూడాలి. మద్యనిషేధం అమలు చేయటం సామాన్య విషయం కాదు. ప్రపంచంలో 90% సందర్భాలలో ఈ మద్య నిషేధం అమలు విఫలమయింది. ఆంధ్రప్రదేశ్‌లోకూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మద్యనిషేధం విధించినప్పటికీ అమలు సరిగా జరగకపోవటంతో కొంతకాలం తర్వాత దానిని ఎత్తివేశారు. మద్యనిషేధం ఉన్నచోట దొంగసారా తయారీ, మద్యం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోవటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.