హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఎలైన్మెంట్ మార్చబోమని నిర్మాణసంస్థ ఎల్ అండ్ టీ స్పష్టీకరించింది. గతంలో, 2009లో చేసుకున్న ఒప్పందం మేరకే పనులు కొనసాగిస్తామని సంస్థ ఎండీ వీఎన్ గాడ్గిల్ ఇవాళ హైదరాబాద్లో మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎలైన్మెంట్ మార్పు బాధ్యత ప్రభుత్వానిదని, నిర్మాణంమాత్రమే తమ పని అని చెప్పారు. ఎలైన్మెంట్పై ప్రభుత్వం ఎలాంటి సూచనలూ చేయలేదని తెలిపారు. పాతబస్తీలో మెట్రో మార్గంపై మాత్రం ఇంకా వివాదం పరిష్కారం కాలేదని, ముఖ్యమంత్రితో, అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే మెట్రో రైల్ ప్రారంభం ఎప్పుడనేదిమాత్రం చెప్పలేదు. మొత్తంమీద గాడ్గిల్ మాటలనుబట్టి మొదట కుదుర్చుకున్న ఒప్పందంలోని మార్గంలోనే మెట్రో రైల్ నిర్మాణం జరుగుతుందని అర్థమవుతుంది.
అసెంబ్లీ, సుల్తాన్ బజార్ మీదగా వెళ్ళే మెట్రో రైల్ మార్గాన్ని మార్చాలనే డిమాండ్ కారణంగా ఆ మార్గంలో పనులను ఎల్ అండ్ టీ కొద్దిరోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రాంతంలో మెట్రో రైల్ నిర్మించటంవలన వారసత్వ కట్టడాలు కనుమరుగైపోతాయని, ఎలైన్మెంట్ మార్చాలని టీఆర్ఎస్ గతంలో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. మెట్రో రైల్ వలన తమ వ్యాపారాలు దెబ్బతింటాయని సుల్తాన్ బజార్ వ్యాపారులు చేసిన ఆందోళనకుకూడా టీఆర్ఎస్ అండగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, మెట్రో రైల్ ఎలైన్మెంట్ మారుస్తామని చెప్పారు. అయితే ఇవాళ గాడ్గిల్ మాత్రం ప్రభుత్వం ఎలాంటి సూచనలూ చేయలేదని చెప్పటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ పరిణామంపై సుల్తాన్ బజార్ వ్యాపార వర్గాలు, ప్రతిపక్షాలు ఏమంటాయో వేచి చూడాలి.