నెల్లూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ నేతలుగా గుర్తింపు తెచ్చుకొన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడిన తరువాత తెదేపాలో ఎప్పుడు చేరబోయేదీ తెలియజేస్తామని తెలిపారు. ఆనం సోదరుల రాకను జిల్లాకు చెందిన కొందరు తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్నపటికీ, నెల్లూరులో పార్టీని మరింత బలోపేతం చేసుకొనేందుకు వారిని పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మొదట తెదేపాలోనే ఉండేవారు. ఎన్టీఆర్ హయంలో మంత్రిగా కూడా చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి మారి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజరుతుండటంతో మళ్ళీ తెదేపాలోకి మారుతున్నారు.