పేరు చివర్లో ఖాన్ అని ఉన్నప్పటికీ వీరి ప్రేమకు అడ్డుఅదుపూ లేనేలేదు. హిందువులు లేదా అన్యమతస్థుల అమ్మాయిలతో జోరుగా ప్రేమలో పడ్డారు. పెళ్ళిళ్లు చేసుకున్నారు. భర్తతో, పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. అన్యమతస్థులను చూసి వారేనాడో భయపడలేదు. ఇలాంటి ఖాన్లు బాలీవుడ్ లో 9మందిదాకా ఉన్నారు. వీరంతా అన్యమతస్థులైన (ముఖ్యంగా హిందూమతానికి చెందిన) ఆడపిల్లలను ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ప్రేమకు ఎల్లలులేవనీ, మతం అడ్డురాదని చాటిచెబుతున్నారు. మనదేశంలోనే హాయిగా ఉంటున్నారు. అలాంటివారి కోవకు చెందినవాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ రెండుపెళ్ళిళ్లు చేసుకున్నాడు. ఈ రెండు పెళ్ళిళ్లలో వధువుగా అతనిపక్కన కూర్చున్నది హిందూమతానికి చెందిన అమ్మాయిలే. అప్పటికే పీకలలోతు ప్రేమలోపడి పెళ్ళి చేసుకున్నారు. అమీర్ మొదట్లో రీమా దత్తాను పెళ్ళిచేసుకుని తర్వాత విడాకులు తీసుకుని కిరణ్ రావ్ ని పెళ్ళాడాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంతో హాయిగా సంసారం లాగించేస్తున్నారు. వారికి అజాద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. దేశంలో హాయిగా సంసారం లాగించే పరిస్థితులు లేవనీ, కాబట్టి వేరే దేశం వెళ్లిపోదామని సలహా ఇచ్చింది ఈమే. హిందూమతానికి చెందిన మహిళే ఇలా మాట్లాడటమేమిటని సదరు ఖాన్ కి సందేహం వచ్చి, తర్వాత తాను కూడా భయపడి ఆ విషయం మీడియాకు చెప్పి నానా గందరగోళం సృష్టించాడు. చివరకు తాను భారతీయుడ్ననీ, ఇక్కడే ఉంటానంటూ ప్రతిజ్ఞ జేశారు.
సరే, షారూక్ ఖాన్ విషయానికి వస్తే, బాలీవుడ్ లో ఎంటర్ కాకముందే హిందువుల కన్యతో లవ్ లో పడ్డాడు. ఆమె పేరు గౌరి. వీరిద్దరూ డేటింగ్ చేశాక, మ్యారేజీ చేసుకున్నారు. ఇప్పుడు వీరి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్నది. వీరికి ముగ్గురు పిల్లలు. (ఆర్యన్, సుహానా, అబ్ రామ్)
ఇక ఇర్ఫాన్ ఖాన్ పదేళ్ల క్రిందట నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఒక అమ్మాయిని చూశాడు. ప్రేమలో పడ్డాడు. ఆమె పేరు సుత్పా సిఖ్దర్ . తర్వాత వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే, ఫర్దీన్ ఖాన్ తన చిన్ననాటి నేస్తం నటాషా మధ్వనితో ప్రేమను పెంచుకుని తమదైన శైలిలో పెళ్ళిచేసుకున్నాడు. నటాషా ఒకనాటి నటి ముంతాజ్ కుమార్తె కాగా, ఫర్దీన్ ఖాన్ వెటెరన్ యాక్టర్ ఫిరోజ్ ఖాన్ కొడుకు.
జయీద్ ఖాన్ గట్టిగా ప్రేమించేసి మలైకా పరేఖ్ ని పెళ్ళిచేసుకున్నాడు. ఇతను ఫర్దీన్ ఖాన్ కు కజిన్. ఇకనేం కజన్ బాటలోనే నడిచి, స్కూల్ మేట్ మలైకాతో ప్రేమలో పడ్డాడు. మలైకాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు సరిగా రంగంలోకి దిగి ఆమె తల్లిదండ్రులకు తమ ప్రేమ సంగతి చెప్పి వారిని ఒప్పించి పెళ్ళిచేసుకున్నాడు. అలా నిజజీవితంలో కూడా హీరో అయిపోయాడు.
ఇక సొహయిల్ ఖాన్ తాను ప్రేమించిన అమ్మాయి సీమా సచ్ దేవ్ ని పెళ్ళిచేసుకుందామనుకున్నాడు. హిందూమతస్థులైన అమ్మాయి తల్లిదండ్రులు తిరస్కరిస్తారని ముందే తెలుసుకుని ప్రేమికులు లేచిపోయారు. అచ్చు సినిమాలో లాగా అదంతా జరిగిపోయింది. అలాగే, అర్బాజ్ ఖాన్ ప్రేమలో పడ్డాడు. మలైకా అరోరా ప్రేమలో నిండామునిగిపోయింది. కానీ, సోహయిల్ లాగా లేచిపోలేకపోయారు. ఓ మంచి అల్లుడిగా పేరుతెచ్చుకోవాలని అర్బాజ్ ఖాన్ వినయం ప్రదర్శించాడు. ఫలితం దక్కింది. చర్చ్ లో వెడ్డింగ్ బెల్స్ మ్రోగాయి.
సైఫ్ అలి ఖాన్ ఐదేళ్లపాటు కరీనా కపూర్ ప్రేమవ్యవహారాలు సాగించి పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ లాస్ ఏంజెల్స్ లో అవంతికా మాలిక్ తో ప్రేమలో పడి పదేళ్లపాటు ఘాటుగా ప్రేమించేసుకుని చివరకు హాయిగా పెళ్ళిచేసుకున్నారు.
అలా..అలా.. బాలీవుడ్ ఖాన్ లు హిందూ లేక ఇతర మతస్థుల ఆడపిల్లలను ప్రేమించేసి, పెళ్ళాడేసి హాయిగా సంసారాలు చేస్తున్నారు. వారి ప్రేమలోకానీ, పెళ్ళిళ్లలోకానీ మతం అడ్డురాలేదు. ఒకవేళ వచ్చినా ఎదిరించి సంసారాలు చేస్తున్నారు. పిల్లాపాపలతో హాయిగా ఉంటున్నప్పటికీ,వారిని అన్నిమతాలకు చెందిన అభిమానులు ఆరాధిస్తున్నప్పటికీ, ఎందుకో అప్పుడప్పుడు వారిలో కొందరికి మనదేశంలో సెక్యులర్ సమస్యలున్నట్లు అనిపిస్తున్నదంటే ఆ తప్పెవరిది?