`పెళ్ళి ఖర్చు తగ్గించుకోవాలి, నిరాడంబరంగా పెళ్ళి జరిపించండి’ అంటూ కర్నాటక విధానసభలో ఒక బిల్లు తీసుకొస్తుంటే, ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న కేరళలోని కొల్లాంలో 55కోట్ల ఖర్చుతో అత్యంత వైభవంగా ఒక పెళ్ళి గురువారం (నవంబర్ 26న) జరిగిపోయింది. ఇందుకోసం బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నాయకత్వంలోనే అద్బుతమైన సెట్టింగ్ వేసినట్లు చెబుతున్నారు. ఈ సెట్ లో పెద్దపెద్ద ఏనుగులు, గుర్రాలు, ఎత్తైన కోటగోడలు…ఇలా దాదాపుగా అన్నీ బాహుబలి సినిమాలో మనం చూసినవే అక్కడ దర్శనమిచ్చాయట.
ఇంతఖర్చు పెట్టిన మొనగాడెవరా ? అని అనుకుంటున్నారా…? కేరళలోనే `మహా శ్రీమంతుడని’ చెప్పదగిన రవి పిళ్లై తన కూతురు డాక్టర్ ఆరతి వివాహంకోసం ఏకంగా 20కోట్ల ఖర్చుతో సాబు సిరిల్ చేత సెట్ వేయించారు. సాబు సిరిల్ కూడా దీన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకున్నారట. బాహుబలిలో కోట సెట్ ని ఐదెకరాల స్థలంలో వేస్తే, ఈ పెళ్ళి కోసం ప్రత్యేక కోటను 8 ఎకరాల స్థలంలో పెద్ద సెట్ వేశారు. . రాజస్థానీ రాజవంశస్థుల కోటలాగా ఉంటుందీ సెట్. కోటద్వారాలు దాటగానే 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకాశమంత పందిరివేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారు. దాతృత్వ కార్యక్రమాలకే పదికోట్లు ఖర్చయిందట.
ఈ పెళ్ళికి మలయాళ సెలెబ్రిటీస్ మంజు వారియర్, శోభన వంటివారే కాకుండా,ప్రపంచవ్యాప్తంగా 42మంది నాయకులు, వివిధ కంపెనీలకు చెందిన సీఈఓలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. రవిపిళ్లై ఈ ఏడాది జూన్ లోనే కేరళలో కెల్లా అత్యంత ధనవంతుడని తేలింది. ఆయన స్థాపించిన ఆర్.పి గ్రూప్ కంపెనీలు గల్ఫ్ దేశాల్లో బాగా పాతుకుపోయాయి. నిర్మాణం, ప్రాధమిక సౌకర్యాల అభివృద్ధి, గనులు, విద్య వంటి రంగాల్లో ఆయనకు దాదాపు 26 కంపెనీలున్నాయి. వీటన్నింటిలో కలిపి 80వేల మంది ఉద్యోగులుగా ఉన్నారు. అంతటి ఘనుడు కనుకనే తన కూతురి పెళ్ళి కోసం కోటనే సెట్ గా వేయించేశాడు. బాహుబలి చిత్రంతో ప్రభావితమైన రవి పిళ్లై ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ కే ఈ ప్రాజెక్ట్ ను అప్పగించడంతో ఈ వివాహవేదిక చూడాలని ఎంతో మంది ముచ్చటపడ్డారు. అయితే, వివాహానికి ఆహ్వానితులను మాత్రమే అనుమతించారు.
బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల సంగతి ఎలా ఉన్నా `బాహుబలి -3′ గా ఈ వివాహ సెట్ వివరాలను విశేషంగా చెప్పుకుంటున్నారు.