ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (సాక్షి) న్యూస్ పేపర్, టీవీ ఛానల్ ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పు పట్టారు. “అతను అవినీతి సొమ్ముతో న్యూస్ పేపర్, టీవీ ఛానల్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలలోకి వచ్చేరు. వాటితో అబద్దపు ప్రచారాలు చేసుకొని అధికారంలోకి వచ్చేద్దామని ఆశించి భంగపడ్డారు. అటువంటి మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు నమ్ముతారని అతను అనుకొన్నారు. కానీ అందులో వార్తలు పేరిట వస్తున్న అబద్దాలని, కట్టుకధలని ఎవరయినా ఎంతకాలం నమ్ముతారు?వాటిని చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. అయినా రాజకీయాలలో ఉన్నవారు స్వంత మీడియా పెట్టుకోవడం ఏమిటి? తెదేపా ఏర్పడి మూడు దశాబ్దాలు దాటినా ఏనాడూ అటువంటి ఆలోచన చేయలేదు. మన గురించి మనం ఏమనుకొంటున్నామో ప్రజలకి చెప్పుకోవడం కంటే, మన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ చాలా ఘాటుగా జవాబిచ్చారు.”చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని సాక్షి మీడియా బయటపెడుతుంటే ఆయన ఉలిక్కిపడుతున్నట్లున్నారు. అందుకే సాక్షి మీడియాని చూడవద్దని ఆయన ‘ఫత్వా’ జారీ చేస్తున్నట్లు మాట్లాడారు. కానీ తెదేపా నేతల ఇసుక మాఫియాపై అన్ని పత్రికలలో వార్తలు వచ్చేయని మరిచిపోయినట్లున్నారు. వాటిని కూడా ఆయన చూడవద్దని ప్రజలకు చెప్పగలరా? జర్నలిజం విలువలను దిగజార్చి, పెయిడ్ వార్తలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఆయన సాక్షి మీడియాని విమర్శించడం చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మీడియా పట్ల ఈవిధంగా అసహనం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదు. మీడియాలో తనకు, తన ప్రభుత్వానికి అనుకూలంగానే వార్తలు రావాలని అయన కోరుకొంటున్నట్లున్నారు. అందుకే తన ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తి చూపే సాక్షి మీడియాను చూడవద్దని ప్రజలకు ఉచిత సలహా ఇస్తున్నట్లున్నారు. ఒక మీడియాను చూడవద్దని ఫత్వాలు జారీ చేసుకోవడానికి మనమేమయినా పాకిస్తాన్ లో ఉన్నామా?” అని ప్రశ్నించారు.
తెదేపా నేరుగా మీడియాను ఏర్పాటు చేసుకోలేదు. కానీ దానికి అండగా రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిలబడ్డాయనే సంగతి ప్రజలందరికీ తెలుసు. అలాగే కుల గజ్జితో పుట్టుకొచ్చిన అనేక వెబ్ సైట్లు కూడా ఆ రెండు రాజకీయపార్టీలకు అండగా నిలబడ్డాయనే సంగతి అందరికీ తెలుసు. ఈ సందర్భంగా హాస్య నటుడు అలీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోక తప్పదు. “రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎక్కడ ఉన్నాయి…కుల పార్టీలు మాత్రమే ఉన్నాయి,” అని అన్నారు. ఆయన మాటలు వాస్తవ రాజకీయ పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. రాజకీయాలలో కులం జొరబడి చాలా కాలమే అయింది. ఆ తరువాత మీడియాలోకి కూడా కులం జొరబడి దాని స్థాయిని దిగజార్చుతోంది. వర్తమాన రాజకీయ పరిస్థితుల గురించి నిష్పక్షపాతంగా ప్రజలకు వివరించవలసిన మీడియా, తను కొమ్ము కాస్తున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా వార్తలను ఇస్తూ అదే నిజమని గట్టిగా వాదిస్తోంది. కానీ రాజకీయ పార్టీలు ప్రజల ఆలోచనా శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేసి భంగపడుతూనే ఉంటాయి. అందుకు చక్కటి ఉదాహరణలుగా డిల్లీ, బిహార్, వరంగల్ ఎన్నికలు మన కళ్ళెదుటే ఉన్నాయి. అయినా రాజకీయ పార్టీలు, వాటిని నడిస్తున్న నేతలు ప్రజలకు ఈ రాజకీయాలు అర్ధం చేసుకొనే శక్తి లేదని తమని తామే ఆత్మవంచన చేసుకొంటూ భ్రమలో జీవిస్తూ ఎన్నికలప్పుడు బోర్లా పడుతుంటారు. దానిని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే రాజకీయ నాయకులు, వారికి కొమ్ము కాసే మీడియా ఎంతగా బాకా ఊదుకొన్నా, ఎదుట వాళ్ళ గురించి ఎంతగా తప్పుడు ప్రచారం చేసుకొన్నా ప్రజలు వాటిని నమ్మబోరని. మరి ప్రజల కంటే తామే తెలివయిన వాళ్ళమని, ప్రజలను తమ చేతిలో ఉన్న మీడియాల ద్వారా ‘మేనేజ్’ చేయవచ్చని భావిస్తున్న రాజకీయ పార్టీలు వాటి నేతలు ఈ విషయం ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?