ముందు నుండి చెప్పుకుంటున్నట్లే తెలంగాణలో బతుకమ్మ చీరలు బంద్ అయినట్లే. బీఆర్ఎస్ హయంలో ప్రతి బతుకమ్మ పండుగ ముందు రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలు ఇచ్చే వారు. సిరిసిల్ల నేతలను చేతి నిండా పని, తెలంగాణ ఆడపడుచులకు సర్కార్ కానుక అంటూ కేసీఆర్ సర్కార్ గొప్పగా ప్రచారం కూడా చేసుకుంది.
అయితే, అవి నాసిరకం చీరలు అని వచ్చిన నేపథ్యంలో… రేవంత్ రెడ్డి సర్కార్ బతుకమ్మ చీరలకు పుల్ స్టాప్ పెట్టింది. ఇటీవలే బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు, ఇక నుండి ప్రతి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళకు ఏడాదికి రెండు నాణ్యత ఉన్న చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కానీ, అందుకు సమయం పట్టేలా ఉండటం… బతుకమ్మ పండుగ మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టత ఉంది. ఈ సమయంలో చీరలు నిలిపివేసి, కొత్త పథకం మొదలుపెట్టకపోతే ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర నిరసన వచ్చే అవకాశం ఉందన్న నిఘా వర్గాల అలర్ట్ నేపథ్యంలో… సర్కార్ కీలక నిర్ణయానికి రెడీ అవుతోంది.
బతుకమ్మ చీరలను ప్రతి రేషన్ షాపు నుండి ఎలా అయితే పంపిణీ చేసే వారో… అలాగే ప్రతి రేషన్ షాపు నుండి ప్రతి మహిళకు 500రూపాయల నగదు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. డ్వాక్రా మహిళకు ఇవ్వాలా, తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇవ్వాలా అన్న మీమాంస ఉన్నట్లు తెలుస్తోంది. మొదట వారి వారి అకౌంట్లో వేయాలని అనుకున్నా… దీనికి అంతగా ప్రచారం రాదన్న ఉద్దేశంతో నగదు పంపిణీకే సర్కార్ మొగ్గు చూపుతోంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఊరూరా పండుగలా నగదు పంపిణీ చేయించాలన్న నిర్ణయానికే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.