ఇద్దరు చోటా వైసీపీ నేతలు ఇచ్చిన రెండు ఒకే రకమైన ఫిర్యాదులను విచారించేందుకు దాదాపుగా పోలీసు బలగం మొత్తాన్ని రంగంలోకి దించుతోంది తెలంగాణ ప్రభుత్వం. రెండు కేసులపై విచారణకు స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9మందితో సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్‌లో ముగ్గురు ఐపీఎస్‌లు, ఐదుగురు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. డీజీపీ ఆఫీసులోనే చాంబర్ ఏర్పాటు చేశారు. మాదాపూర్, ఎస్ఆర్నగర్లో నమోదైన కేసులు సిట్‌కు బదిలీ చేశారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ సీఐడీ సహకారం సిట్ తీసుకోనుంది. సిట్‌లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్లు బి.రమేష్, వెంకట్రామిరెడ్డి ఉన్నారు. జగన్ బంధువు లోకేశ్వర్‌రెడ్డి, వైసీపీ యువజన విభాగం నేత దశరథరామిరెడ్డి చేసిన ఫిర్యాదులపై వీరు దర్యాప్తు చేస్తారు.
ఆ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులకు సాక్ష్యాలున్నాయా లేవా, అసలు వారికి సంబంధించిన అంశమేనా కాదా అన్నదానిపై తెలంగాణ పోలీసులకు పట్టింపు లేదు. శనివారం సాయంత్రం నుంచి ఇదే హడావుడి ప్రారంభమయింది. అనుక్షణం సమాచారం లీకేజీలు, ఓ పోలీస్ కమిషనర్ ఏకంగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెడతానని హెచ్చరిస్తారు. అసలు ఆధార్ డేటా కేంద్రం దగ్గర ఉంటుందని ఆ యాప్‌లో ఉన్నది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఓటర్ లిస్ట్ అని ఈసీ నేరుగా చెప్పినా పట్టించుకోరు. మరో పోలీస్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ యాప్ ఎలా పనిచేస్తుందో వివరించి, ఆ యాప్‌కు చివరికి టీడీపీకి ఓట్లు వేయరని తేలిన ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసి అదే పెద్ద కేసు అని చెబుతారు. ఓటర్ల జాబితాలో పోలీస్ కమిషనర్ అనుకున్న పేరు లేకపోతే ఎందుకు లేదో సంబంధిత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఈ మెయిల్ పెడితే సమాచారం వస్తుంది.
ఓటు పోయిందని దశరథరామిరెడ్డి చేసిన ఫిర్యాదుకు యాప్‌ను రూపొందించే సాఫ్ట్వేర్ సంస్థకు ఏమి సంబంధం ఉంటుందో పోలీస్ కమిషనర్ అంచనా వేయలేకపోయారు. ఓటును అక్రమంగా తొలగించినట్లయితే వాళ్లే ఫిర్యాదు చేస్తారు. ఒక ఓటు తీసేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సివిల్ సర్వీస్ అధికారులకు తెలియకుండా ఉండదు. కానీ ఈ కేసులో మాత్రం ఆ వైసీపీ చోటా నేతలు చెప్పడమే ఆలస్యం రంగంలోకి దిగిపోయారు. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు. ఏపీలో తన రాజకీయానికి ఇంకెవరికీ దొరకనంత పోలీసు సాయం పక్క రాష్ట్రం నుంచి దొరుకుతోంది.