బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. సీజన్ టైటిల్ ని రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నారు. 15 వారాల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో శ్రీముఖి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోటల్ సీజన్ ని నాగార్జున హోస్ట్ చేశారు. హోస్టింగ్ విషయంలో నాగార్జున ప్రతిభని మెచ్చుకోవాల్సిందే.
ఎందుకంటే బిగ్ బాస్ ని హోస్ట్ చేయడం మామూలు విషయం కాదు. గత సీజన్ హోస్ట్ చేసిన నానికి ఆ కష్టం, అందులో వుండే ఇబ్బందులు బాగా తెలుసు. కౌశల్ ఆర్మీ అంటూ నానిపై సోషల్ మీడియా వేదికగా మామూలు దాడి జరగలేదు. చాలా సార్లు నాని తన ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చుకున్నాడు. చివరికి హోస్ట్ పోస్ట్ కి దండం పెట్టేశాడు.
అయితే దీనికి కారణం.. నాని ప్రజంటేషన్. మనసులో ఎలాంటి పక్షపాతం లేకపోయినా ఒక సైడ్ తీసుకొని మాట్లాడుతున్నాడేమో అన్న భావన చూసిన ప్రేక్షకుల్లో కలిగితే గనుక ఖచ్చితంగా హోస్ట్ గా నెగిటివ్ మార్కులు తీసుకున్నట్లే. అయితే నాగార్జున మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తపడ్డారు. ఎక్కడ టెంపర్ లూజ్ కాలేదు. వన్ సైడ్ తీసుకోలేదు. చాలా కూల్ గా సీజన్ ముగించారు.
చివరి రోజు నాగార్జున చేసిన ట్వీట్ కాసేపు రాహుల్ ఫ్యాన్స్ ని అప్సట్ చేసినా.. విన్నర్ రాహులే అని తెలిసాక ఆ ట్వీట్ కూడా షో క్యురియాసిటీని పెంచడానికే అని బిగ్ బాస్ వ్యూవర్స్ భావించారు. మొత్తానికి బిగ్ ట్రబుల్స్, ట్రోల్స్ గల ఈ షోని చాలా కూల్ గా ముగించి జెంటిల్ హోస్ట్ అనిపించుకున్నాడు నాగార్జున.