వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ‘ఎమ్మెల్యే’ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకుని ఎవరు వచ్చినా సరే ఎగబడి వారిని పార్టీలో చేర్చేసుకుంటూ.. ప్రధాన ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయడానికి ఎత్తులు వేస్తూ ఉన్న చంద్రబాబునాయుడుకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా నాయకులను వైకాపానుంచి తెదేపాలో చేర్చేసుకోవడం గురించి మాత్రమే ఆయన దృష్టి పెట్టారు. ఇకమీదట ఆయా వలస నేతలకు, ఆ ప్రాంతాల్లో తమ సొంత పార్టీ నేతలకు మధ్య సయోధ్య కుదిర్చి, పార్టీకి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ఆయన మెడలో గుదిబండలాగా మారుతున్నది.
అలాంటి రాజీపంచాయతీలకు చంద్రబాబునాయయుడు సోమవారం నాడే శ్రీకారం దిద్దుతున్నారు. కర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వర్గాల మధ్య సయోధ్య కుదిర్చడానికి ఆయన రెండు వర్గాల నేతలను తన వద్దకు పిలిపించుకున్నారు.
నిజానికి వలసనేతలకు, పార్టీలో ఉన్న పాతనేతలకు మధ్య సయోధ్య కుదిరించడం అనేది చాలా పెద్ద కసరత్తు. ఇప్పటికే చాలా చోట్ల పరస్పర శత్రుత్వాలు ఉన్న నాయకులు కూడా ఈ ‘ఆపరేషన్ ఆకర్ష’లో భాగంగా పార్టీలోకి వచ్చేశారు. అలాంటి వారినందరినీ ఇప్పుడు పాత నేతలతో మిత్రులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత బాబు మీద పడింది.
ప్రధానంగా కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి కకుటుంబాల మధ్య తొలినుంచి వర్గపోరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భూమా పార్టీలోకి వస్తాడనే పుకార్లు వచ్చిన నాటినుంచీ.. శిల్లా వర్గీయులు కాస్త ఎడమొగం పెడమొగంగానే ఉన్నారు. పైకి మాత్రం.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, చంద్రబాబు ఎలా చెబితే అలా చేస్తాం అంటున్నారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే గనుక.. ఆ దుష్ప్రభావం జిల్లా అంతా పడుతుంది. ఆ భయంతోనే చంద్రబాబునాయుడు రాజీపంచాయతీలకు వీరితోనే శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది.
ఇక వరుసగా ఇలాంటి పంచాయతీలే జరుగుతూ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా అయిన వెంటనే జమ్మలమడుగునేతలు, ప్రకాశం జిల్లా నేతలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలు ఇలా వరుసగా అందరితోనూ రాజీపంచాయతీలు వరుసగా చేయాల్సి ఉంటుందని అంతా అంటున్నారు. అందరికీ రాజీలు కుదిర్చేలోగా.. చంద్రబాబు నాయుడు తల బొప్పి కడుతుందని కూడా నాయకులు అంటున్నారు.