తెదేపాకి రెండు బలహీనతలున్నాయి. ఏదో మొహమాటానికి తెదేపాకి అని అనుకొంటున్నా నిజానికి అవి చంద్రబాబు నాయుడు బలహీనతలేనని అందరికీ తెలుసు. వాటిలో మొదటిది భాజపాతో పొత్తులు. రెండవది ఓటుకి నోటు కేసు.
నిజానికి భాజపాతో పొత్తులు తెదేపాకి పెద్ద బలం అవ్వాలి కానీ అదే ఇప్పుడు ఒక పెద్ద బలహీనతగా మారిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న భాజపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే రాష్ట్రానికి నిధుల ప్రవాహం వచ్చి పడిపోతుందని ఆశిస్తే, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆర్ధిక ప్యాకేజి, వివిధ ప్రాజెక్టులకి నిధులు వంటి హామీలను అమలుచేయమని ప్రధాని నరేంద్ర మోడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రం పట్ల చాలా ఉదాశీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గానీ ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తే చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి చక్కా వెళ్ళిపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందారు. ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిస్థితులు వివరించి ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేయమని అడిగినా ప్రధాని నరేంద్ర మోడి పట్టించుకోలేదు. రాష్ట్రం పట్ల కేంద్ర ఉదాశీన వైఖరికి అది అద్దం పడుతోంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటివారు భాజపాతో పొత్తులు లేకపోయినప్పటికీ, ఎన్డీయేలో భాగస్వాములు కానపట్టికీ వార్వారి రాష్ట్రాలకు కావలసినవన్నీ కేంద్రాన్ని నిలదీసి సాధించుకోగలగుతున్నారు. కానీ భాజపాకి మిత్రపక్షంగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఏమీ సాధించుకు రాలేకపోతున్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో ఆయన పేరు ప్రతిష్టలు, పార్టీకి నష్టం కలుగుతున్నప్పటికీ ‘తగిన సమయం కోసం’ ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ బలహీనత కారణంగా తెదేపాకు నష్టం కలిగితే అది వారి స్వంత విషయం కానీ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుండటంతో ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. కానీ వారి ఆగ్రహం తెలియదన్నట్లుగా నటిస్తున్నారు. ఇటువంటి వైఖరి వలన చివరికి తెదేపాయే నష్టపోవచ్చును.
ఇంక ఓటుకి నోటు వ్యవహారం కారణంగా కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు మోకరిల్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ భయంతోనే తెలంగాణాలో తెదేపాను కోల్పోవడానికి కూడా సిద్దపడటం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఈ విషయం కూడా తెదేపా స్వంత వ్యవహారమే కనుక దానితో ప్రజలకి సంబంధం లేదు కానీ ఈ బలహీనత కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటుంటే ప్రజలు సహించరని గ్రహిస్తే మంచిది.
ఈ రెండు బలహీనతలు చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు కానీ వాటిని ఎదుర్కొని బయటపడటం సాధ్యం కాదని కూడా తెలుసు. అందుకే ఆయన మౌనం వహిస్తున్నారేమో? అయితే ఈ బలహీనతలకు రాష్ట్రం, ప్రజలు మూల్యం చెల్లించవలసిరావడమే శోచనీయం. మిగిలిన మూడేళ్ళు కూడా ఇదే వైఖరి, పరిస్థితి కొనసాగితే, ప్రజలు కూడా అటువంటి బలహీనతలు లేని నేతకి, పార్టీకి అధికారం కట్టబెట్టవచ్చు.