నిరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం … సమర్థమైన వాదనలు వినిపించిన భారత ఏజెన్సీలు విజయం సాధించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. పధ్నాలుగు వేల కోట్ల మేర మోసం చేసి.. నిరవ్ మోడీ లండన్ పారిపోయారు. కొన్నాళ్లు ఆయన ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. ఆయన వద్ద పలు రకాల పాస్‌పోర్టులు ఉండటంతో అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా మాత్రం గుర్తించారు. చివరికి లండన్ వీధుల్లో తిరుగుతున్న నిరవ్ మోడీని మీడియానే గుర్తించి పలకరించింది. అప్పట్నుంచి ఆయనను ఇండియాకు తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిరవ్ మోడీ.. ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయన పేరుతోనే సొంత బ్రాండ్ ఉంది. తనకు ఎంతో బ్రాండ్ వాల్యూ ఉందని నమ్మించి… పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించలేదు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది.
బ్రిటన్ కోర్టులో భారత్ సమర్థవంతమైన వాదన వినిపించింది. దీంతో యూకే కోర్టు కూడా.. నీరవ్ మోడీని శిక్షించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సబబేనని.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మోడీ ప్రయత్నించారని తేల్చింది. భారత్‌కు అప్పగించడం వలన ఆయనకు అన్యాయం జరగదని స్పష్టంచేసింది. అప్పగించాలని ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో లాంఛనాలు పూర్తి చేసి.. ఆయనను ఇండియాకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయనను ఇండియాకు తీసుకు వస్తారు సరే.. మరి డబ్బులు ఎలా వసూలు చేస్తారన్నది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఆర్థిక నేరాల చట్టాల ప్రకారం.. ఆయన కొంత కాలం జైల్లో ఉంటారు. తర్వాత బెయిల్ వస్తుంది.
ఆ తర్వాత ఆయన నిర్భయంగా ఇండియాలో పర్యటిస్తారు. భారీ బ్యాంక్ మోసం చేసిన వ్యక్తిగా ఆయనకు గౌరవమే లభిస్తుంది కానీ.. చీత్కారాలు లభించవు. ఇండియాలో పరిస్థితి అలా మారిపోయింది. పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడి లండన్ కు వెళ్లి దాక్కున్న వారిలో విజయ్ మాల్యా, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ కూడా ఉన్నారు. లలిత్ మోడీని ఇండియాకు అప్పగించే పిటిషన్లు తేలిపోయాయి. విజయ్ మాల్యాపై పిటిషన్లు మాత్రం విచారణలో ఉన్నాయి.