వరద నష్టం అంచనాలకు కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. కేంద్రం ఏం సాయం చేసిందంటూ టీఆర్ఎస్ నేతలు అదేపనిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అయితే వరద నష్టం అంచనాలను పంపాల్సింది రాష్ట్రమేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ప్రజల్లోకి మాత్రం బీజేపీనే దోషిగా చూపే ప్రయత్నాలు జరుగుతూండటంతో బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. బండి సంజయ్ కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితి వివరించారు. తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షాకు వివరించారు.
తమపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల గురించి వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని నిర్ణయించారు. హైపవర్ కమిటీ అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వరద నష్టం వస్తుందా… నిధులు మంజూరు చేస్తుందా అన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది.
హోంశాఖకు వరద నష్టానికి ఏమిటి సంబంధం అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే బీజేపీ నేతలు మాత్రం.. వేగంగా కేంద్రం స్పందించిందని చెప్పుకోవడానికి ఈ మాత్రం స్పందన చాలనుకుంటున్నారు. మొత్తానికి బీజేపీ నేతలు తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ది ఎలా ఉందో మరోసారి నిరూపించుకున్నారన్న సెటైర్లు మాత్రం టీఆర్ఎస్ వర్గాల నుంచి రావడం ఖాయంగా కనిపిస్తోంది.