మరి కొద్ది గంటల్లో అల్లు అర్జున్ ‘పుష్ప’ థియేటర్ లోకి రానుంది. ఈ గ్యాప్ లో పుష్ప కథ గురించి ఓ కీలకమైన పాయింట్ తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నారు. ట్రైలర్ కూడా అదే చూపించారు. అయితే ఈ సినిమాలో వేరే ఎమోషనల్ పాయింట్ వుంది. పుష్ప సవతి కొడుకుల కథ. అవును… అల్లు అర్జున్, అజయ్ ఇద్దరు సవతి సోదరులు. అల్లు అర్జున్ పాత్రకి ఇంట్లో ప్రేమ, గౌరవం దక్కక.. బయటికి వచ్చేస్తాడు. ఎప్పటికైనా తన అన్నకంటే పవర్ ఫుల్ కావాలని పుష్ప రాజ్ గా ఎదిగే క్రమం పుష్పలో కనిపిస్తుందని తెలిసింది.
సవతి సోదరుల ఫార్ముల ఇండస్ట్రీ హిట్ పాయింట్. సక్సెస్ ఫుల్ కమర్షియల్ పాయింట్. మణిరత్నం ఘర్షణ నుంచి మొదలుపెడితే గబ్బర్ సింగ్ వరకూ బోలెడు కథలు వచ్చాయి. ఇందులో చాలా హిట్లు వున్నాయి. మంచి ఎమోషన్ పండించే అవకాశం వున్న ఫ్లాట్ ఇది. ఈ రకంగా చూసుకుంటే సుకుమార్ సేఫ్ గేమ్ ఆడినట్లే కనిపిస్తుంది. సినిమాని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. మరి మొదటి పార్ట్ కథని ఎంత వరకూ రిలీవ్ చేస్తారన్న సంగతి మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.